కేరళలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గ్యాప్‌లో పడిపోయిన కారు.. గాల్లో వేలాడుతూ కనిపించిన దృశ్యం (ఇదిగో వీడియో)

  • కేరళలోని కన్నూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • భద్రతా హెచ్చరికను దాటి అసంపూర్ణమైన వంతెన పైకి వెళ్లిన కారు
  • వంతెన రెండు భాగాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో చిక్కుకుపోయిన కారు
కేరళ రాష్ట్రం, కన్నూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జాతీయ రహదారి 66 సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన రెండు భాగాల మధ్య ఒక కారు గాల్లో వేలాడుతూ కనిపించిన తీరు భయానకంగా ఉంది.

తలస్సేరి నుంచి కన్నూర్‌కు ప్రయాణిస్తున్న ఒక కారు, వంతెన వద్ద ఏర్పాటు చేసిన భద్రతా హెచ్చరికలను దాటి అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్‌ పైకి దూసుకెళ్లింది. ఆ వంతెన నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో, రెండు భాగాల మధ్య కొంత ఖాళీ ఏర్పడింది. అధిక వేగంతో వచ్చిన కారు ఆ ఖాళీలో పడిపోయింది.

రెండు వంతెన భాగాల మధ్య ఖాళీ ప్రదేశం ఇరుకుగా ఉండటంతో కారు అందులో ఇరుక్కుపోయింది. ప్రమాదకరంగా గాలిలో వేలాడుతున్న కారులోని డ్రైవర్‌ను స్థానికులు, సహాయక సిబ్బంది సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. కారు డ్రైవర్ పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


More Telugu News