షేక్ హసీనాకు మరణశిక్ష... భారత కేంద్ర ప్రభుత్వం స్పందన

  • బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష
  • మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని నిర్ధారణ
  • ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న హసీనా
  • హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
  • ఆచితూచి స్పందించిన భారత విదేశాంగ శాఖ
బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ-బీడీ) మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారిస్తూ సోమవారం ఈ సంచలన తీర్పును వెలువరించింది. హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్-మామున్‌కు కూడా ఇదే శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ఉద్యమాన్ని అణచివేయడానికి ఆదేశాలు జారీ చేశారన్న ఆరోపణలపై వీరిపై విచారణ జరిగింది. ఈ అణచివేతలో దాదాపు 1,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. కొన్ని నెలలుగా సాగిన ఈ విచారణ ప్రక్రియ ఈ తీర్పుతో ముగిసింది.

2024 ఆగస్టులో అధికారం కోల్పోయినప్పటి నుంచి షేక్ హసీనా ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీటీ-బీడీ తీర్పుపై బంగ్లాదేశ్‌లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. దీనిని ఒక "చారిత్రక తీర్పు"గా అభివర్ణించింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనా, అసదుజ్జమాన్ ఖాన్‌లను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం గతంలో చేసిన అభ్యర్థనలపై భారత్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ఈ కీలక పరిణామంపై భారత విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. "పొరుగు దేశంగా, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరత నెలకొనాలని కోరుకుంటున్నాం. ఈ లక్ష్యం కోసం సంబంధిత వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం" అని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రకటన ద్వారా భారత్ ఏ పక్షం వహించకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది.

మరోవైపు, ఈ తీర్పును షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. రాయిటర్స్‌తో ఆమె మాట్లాడుతూ.. "ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని, ఎలాంటి చట్టబద్ధత లేని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కీలుబొమ్మ ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది. కోర్టులో నా వాదన వినిపించుకోవడానికి నాకు సరైన అవకాశం ఇవ్వలేదు. సరైన ఆధారాలను నిష్పక్షపాతంగా పరిశీలించే నిజమైన న్యాయస్థానం ముందు నాపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోవడానికి నేను భయపడను" అని ఆమె స్పష్టం చేశారు. ఈ తీర్పుతో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉండగా, హసీనా అప్పగింత విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.


More Telugu News