ఆసక్తికరంగా 'దండోరా' టీజర్‌

  • తెలంగాణ నేపథ్య కథతో 'దండోరా' 
  • ఇంట్రెస్టింగ్‌ పాత్రలు, అలరించే సంభాషణలు
  • అలరిస్తున్న టీజర్‌  
ఆసక్తికరమైన పాత్రలు, ఆలోచింపజేసే సంభాషణలతో విడుదలైన ‘దండోరా’ టీజర్ అందరినీ అలరిస్తోంది. 'కోర్టు' సినిమాలో మంగపతిగా అలరించిన శివాజీ మరోసారి ఓ విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ నిర్మాత. డిసెంబర్ 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌ను గమనిస్తే దర్శకుడు ప్రతి పాత్రను పరిచయం చేసి, ఆ పాత్ర విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేశాడు. సర్పంచ్ పాత్రలో నవదీప్ చెప్పే సంభాషణలు ఆసక్తిగా, హాస్యంతో కూడుకున్నాయి. "హైదరాబాద్ పో.. అమెరికా పో.. ఎక్కడికైనా పో.. చస్తే ఇక్కడికే తేవాలె.." లాంటి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే, శివాజీ పాత్రలోని "చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద" అనే డైలాగ్, వేశ్య పాత్రలో బిందు మాధవి చెప్పే "ఎవరు చెప్పారు నేను తప్పు చేస్తున్నానని.. వాళ్ళు డబ్బులిస్తున్నారు.. నేను వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాను" అనే డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

సమాజంలోని అగ్ర వర్ణాల అరాచకాలను ప్రశ్నిస్తూ, సామాజిక స్పృహను కలిగించే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలోని సంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, హాస్యం, హృదయాలను బరువెక్కించే ఎమోషన్స్‌ను మిక్స్ చేసి దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆకట్టుకునే పాత్రలతో, ఆలోచింపజేసే సంభాషణలతో 'దండోరా' టీజర్ ఆకట్టుకుంది. 'దండోరా' సినిమా విడుదలకు ముందు రావాల్సిన బజ్‌కు ఈ టీజర్ ఒక ప్రారంభంలా ఉందని చెప్పవచ్చు.







More Telugu News