జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం: ఈటల రాజేందర్

  • అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినందువల్లే ఓడిపోయామన్న ఈటల
  • ఉప ఎన్నికల్లో ఓడినంత మాత్రాన బీజేపీ పని అయిపోయినట్లు కాదని వ్యాఖ్య
  • కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినప్పటికీ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటమిపై ఆ పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం వల్లే ఓటమి చెందామని ఆయన అభిప్రాయపడ్డారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ గత ఆరు నెలలుగా ఎన్నికల కార్యాచరణను ప్రారంభించాయని అన్నారు. ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీజేపీ పని అయిపోయినట్లుగా మాట్లాడటం సరికాదని ఆయన పేర్కొన్నారు.

హుజూరాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినప్పటికీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఉప ఎన్నికలు జరగగా, 7 స్థానాల్లో అధికార పార్టీ గెలవగా, రెండింట్లో బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు, చీరలు పంపిణీ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు.

హైదరాబాద్‌లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని అన్నారు. నగర జనాభాను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ వ్యవస్థ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేపట్టాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నగర సమస్యలను విన్నవిస్తానని అన్నారు. ఖాళీగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చకుండా చూడాలని కోరతానని అన్నారు.


More Telugu News