ఆహారం, నీటిలో పురుగుమందుల అవశేషాలు.. గుర్తించేందుకు కొత్త స్మార్ట్ డివైజ్!

  • ఐఐటీ మద్రాస్, పంజాబ్ వర్సిటీ పరిశోధకుల కొత్త ఆవిష్కరణ
  • ఆహారం, నీటిలో పురుగుమందుల అవశేషాలను గుర్తించే పరికరం
  • అతి తక్కువ మోతాదులో ఉన్నా కచ్చితత్వంతో పసిగడుతుంది
  • రంగు మార్పు ఆధారంగా ఫలితాలు.. తక్కువ ఖర్చుతో వేగంగా గుర్తింపు
  • రైతులు, ఆహార భద్రతా సంస్థలకు ఎంతో ప్రయోజనకరం
ఆహార పదార్థాలు, నీటిలో మానవ ఆరోగ్యానికి హాని కలిగించే పురుగుమందుల అవశేషాలను అత్యంత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఐఐటీ మద్రాస్, పంజాబ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పోర్టబుల్, ఆటోమేటెడ్ ఆప్టికల్ పరికరాన్ని రూపొందించారు. అతి తక్కువ మోతాదులో ఉన్న పురుగుమందులను సైతం ఇది సులభంగా పసిగట్టగలదు.

ప్రస్తుతం పురుగుమందుల అవశేషాలను, ముఖ్యంగా మలాథియాన్ వంటి వాటిని గుర్తించడానికి ల్యాబ్‌లలో అనుసరిస్తున్న పద్ధతులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అంతేకాకుండా వీటికి ఎక్కువ సమయం పట్టడంతో పాటు నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం. ఈ సమస్యలను అధిగమించేందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో ఈ కొత్త స్మార్ట్ మలాథియాన్ డిటెక్షన్ డివైజ్ (MDD)ను తయారుచేశారు.

ఈ పరికరం గోల్డ్ నానోపార్టికల్స్ (AuNPs) ఆధారంగా పనిచేస్తుంది. మలాథియాన్‌ను ప్రత్యేకంగా గుర్తించేందుకు రూపొందించిన అప్టామర్ మాలిక్యూల్‌ను ఇందులో ఉపయోగించారు. పరీక్షించే నమూనాలో మలాథియాన్ ఉన్నప్పుడు, ఈ పరికరంలోని ద్రావణం రంగు ఎరుపు నుంచి నీలం రంగులోకి మారుతుంది. ఈ మార్పును పరికరంలోని ఆప్టికల్ సిస్టమ్ కచ్చితంగా కొలిచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఆటోమేటెడ్ కావడంతో ఫలితాలు వేగంగా, నమ్మకంగా వస్తాయని పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన వివరాలు 'రివ్యూ ఆఫ్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

"రైతులు, ఆహార భద్రతా ఏజెన్సీలు, పర్యావరణ నియంత్రణ సంస్థలకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. పంట పొలాల్లోని నీరు, పండ్లు, కూరగాయలు, మట్టిలో పురుగుమందుల కాలుష్యాన్ని అక్కడికక్కడే వేగంగా తనిఖీ చేయవచ్చు. తద్వారా ప్రజారోగ్యానికి ముప్పు తగ్గుతుంది" అని ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ సుజాత నారాయణన్ ఉన్ని ఐఏఎన్ఎస్‌కు వివరించారు.

ప్రస్తుతం ల్యాబ్ పరిస్థితుల్లో పరీక్షించిన ఈ పరికరాన్ని త్వరలో పండ్లు, కూరగాయలు, పొలాల్లోని నీటి నమూనాలతో పరీక్షించనున్నట్లు పంజాబ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రోహిత్ కుమార్ శర్మ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రకాల పురుగుమందులను గుర్తించేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News