సౌదీ అరేబియా ప్రమాదం... ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

  • మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసిన ప్రధాని
  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
  • సౌదీ ప్రభుత్వంతో మన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత యాత్రికులతో వెళుతున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొనగానే మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో 45 మంది సజీవ దహనమయ్యారు.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రియాద్‌లోని భారత ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ అవసరమైన సహాయం అందిస్తాయని వెల్లడించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

మదీనా-మక్కా రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు కిరణ్ రిజిజు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో వారికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.


More Telugu News