సౌదీలో ఘోర బస్సు ప్రమాదం.. బాధితులను ఆదుకోవాలన్న కేసీఆర్

  • ఉమ్రా యాత్రికులతో వెళుతున్న బస్సు దగ్ధం.. 42 మంది మృతి
  • మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన 16 మంది
  • ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
  • ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు యాత్రికులు మరణించారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుంచి మదీనా వెళుతున్న బస్సు అగ్నిప్రమాదానికి గురవడంతో 42 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉమ్రా యాత్ర ముగించుకుని మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సు ఇవాళ‌ తెల్లవారుజామున 1:30 గంటలకు బదర్‌-మదీనా మార్గమధ్యంలోని ముఫరహత్‌ వద్ద ఓ డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో బస్సులో భారీగా మంటలు చెలరేగి, నిద్రలో ఉన్న ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన 16 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేసిన కేసీఆర్, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.

ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. బాధితుల వివరాల కోసం 79979 59754, 99129 19545 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు. 


More Telugu News