ఘట్టమనేని వారసుడి మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.. అధికారిక ప్రకటన చేసిన డైరెక్టర్

  • ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ
  • అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా
  • హీరోయిన్‌గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా ఎంపిక
  • రాషా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • వైజయంతి మూవీస్ సమర్పణలో సినిమా నిర్మాణం
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో యువ కథానాయకుడు వెండితెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. దివంగత సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేశ్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ‘RX100’, ‘మంగళవారం’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనే ఉత్కంఠకు చిత్రబృందం తెరదించింది.

కొంతకాలంగా ప్రచారంలో ఉన్నట్లుగానే, ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానిని హీరోయిన్‌గా అధికారికంగా ఖరారు చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు అజయ్ భూపతి సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ రాషా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బైక్‌పై జీన్స్, బ్లాక్ టీ షర్ట్‌లో కూర్చుని ఉన్న రాషా లుక్ ఆకట్టుకుంటోంది. "AB-4 ప్రాజెక్ట్‌లోకి జాతీయ సంచలనం రాషా థడానిని స్వాగతిస్తున్నాం. ఆమె నటనతో అందరినీ మంత్రముగ్దులను చేస్తుంది. ప్రేక్షకులు కచ్చితంగా ఆమెతో ప్రేమలో పడతారు" అని ఆయన పేర్కొన్నారు.

‘AB-4’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు. కొండల నేపథ్యంలో సాగే ఓ వాస్తవిక ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో రాషా థడాని టాలీవుడ్‌కు పరిచయం అవుతుండటంతో, జయకృష్ణ-రాషా జోడీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.


More Telugu News