రోడ్డు మీద దొరికిన ఏటీఎం కార్డుతో డబ్బు విత్ డ్రా.. ఏపీలో మహిళ అరెస్టు

  • కార్డుతో పాటు పిన్ నెంబర్ రాసి పెట్టుకున్న బాధితురాలు
  • వేలూరులో కార్డును పోగొట్టుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు
  • అప్పటికే కార్డు దొరికిన మహిళ రూ.50 వేలు డ్రా చేసిందని గుర్తించిన పోలీసులు
రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళకు ఏటీఎం కార్డు కనిపించింది. దాంతో పాటే పిన్ నెంబర్ రాసిన స్లిప్ కూడా ఉండడంతో ఏటీఎం సెంటర్ కు వెళ్లి రూ.50 వేలు విత్ డ్రా చేసి తీసుకెళ్లింది. కొంత బంగారం కొనుగోలు చేసి మిగతా సొమ్ము దాచుకుంది. అయితే, పోలీసులు వెతుక్కుంటూ ఇంటికి వచ్చి ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఏపీలోని వేలూరులో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

చిత్తూరు జిల్లా గుడిపాలకు చెందిన ఇన్బకుమారి భర్త మాజీ సైనికుడు. ఇటీవల కళ్లజోడు కొనేందుకు కుమార్తె రేచల్ ను వెంటబెట్టుకుని వేలూరు వెళ్లింది. అనంతరం మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయానికి వెళ్లిన ఇన్బకుమారి.. అక్కడి సిబ్బంది ఆధార్ కార్డ్ కాపీ అడగడంతో జిరాక్స్ కోసం వెళ్లింది. ఈ క్రమంలో హ్యాండ్ బ్యాగులో నుంచి ఏటీఎం కార్డు ఎక్కడో పడిపోయింది. చుట్టుపక్కల వెతికినా దొరకలేదు. చేసేదేంలేక బ్యాంకుకు వెళ్లి కొత్త కార్డు తీసుకోవచ్చని సరిపెట్టుకుంది.

ఇంతలోనే ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.50 వేలు విత్ డ్రా చేసినట్లు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దీంతో ఇన్బకుమారి వేలూరు దక్షిణ పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బ్యాంకు సిబ్బంది సహకారంతో డబ్బు డ్రా చేసిన ఏటీఎం సెంటర్ లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో రాజపాళ్యంకు చెందిన దేవి అనే మహిళ డబ్బు విత్ డ్రా చేసినట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విత్ డ్రా చేసిన నగదులో రూ.30 వేలకు బంగారు కమ్మలు కొనుగోలు చేసినట్లు దేవి చెప్పింది. ఆ కమ్మలతో పాటు మిగిలిన రూ.20 వేలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దేవిని జైలుకు తరలించారు.


More Telugu News