టీమిండియా ఓటమి.. గంభీర్ వ్యూహంపై గంగూలీ ఫైర్!

  • కోల్‌కతా టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంపై చెలరేగిన వివాదం
  • పిచ్‌ను తామే అలా తయారు చేయించామని ఒప్పుకున్న కోచ్ గంభీర్
  • గంభీర్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గంగూలీ
  • మూడు రోజుల్లో కాదు, ఐదు రోజుల్లో మ్యాచ్ గెలవాలని గంభీర్‌కు హితవు
  • బుమ్రా, సిరాజ్ లాంటి బౌలర్లపై నమ్మకం ఉంచాలని సూచన
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో భారత జట్టు అనుసరించిన వ్యూహంపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్‌లను మూడు రోజుల్లో ముగించడం కాకుండా, ఐదు రోజుల పాటు ఆడి గెలవడంపై దృష్టి పెట్టాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఆయన  సూచించాడు.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. బౌలర్లకు విపరీతంగా అనుకూలించిన ఈ పిచ్‌పై 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం పిచ్‌ను తమ జట్టు సూచనల మేరకే క్యూరేటర్ సిద్ధం చేశారని గంభీర్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో గంగూలీ స్పందించారు.

ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడుతూ.. "అది టెస్టు క్రికెట్‌కు అంత మంచి వికెట్ కాదు. అయినా భారత్ 120 పరుగులు చేసి ఉండాల్సింది. తమకు అలాంటి పిచ్ కావాలని గంభీరే క్యూరేటర్‌కు చెప్పాడని తెలిసింది. దీనిపై వివాదం ఏమీ లేదు, కానీ మనం మంచి పిచ్‌లపై ఆడాలి" అని స్పష్టం చేశాడు.

గంభీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే అతని ఆలోచనా విధానంలో మార్పు రావాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు. "గంభీర్ తన బౌలర్లయిన బుమ్రా, సిరాజ్ లతో పాటు స్పిన్నర్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి. వాళ్లు ఎలాంటి పిచ్‌పై అయినా మ్యాచ్‌లు గెలిపించగలరు. టెస్ట్ మ్యాచ్‌లను మూడు రోజుల్లో కాదు, ఐదు రోజుల్లో గెలవాలి" అని గంగూలీ హితవు పలికాడు. టెస్ట్ క్రికెట్ మనుగడకు ఇలాంటి పిచ్‌లు ఏమాత్రం మంచివి కావని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.


More Telugu News