Sheikh Hasina: తీర్పుకు ముందు భగ్గుమన్న బంగ్లాదేశ్.. షేక్ హసీనాకు మరణశిక్ష?

Sheikh Hasina Bangladesh Erupts Before Verdict Death Sentence
  • షేక్‌ హసీనా కేసులో తీర్పుకు ముందు బంగ్లాలో తీవ్ర ఉద్రిక్తత
  • మాజీ ప్రధానికి మరణశిక్ష విధించాలని కోరుతున్న ప్రాసిక్యూషన్
  • నిరసనలకు పిలుపునిస్తూ ఆడియో సందేశం విడుదల చేసిన హసీనా
  • ఢాకాలో వరుస పేలుళ్లు, దహనం ఘటనలతో అల్లకల్లోలం
  • అల్లరి మూకలపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల జారీ
బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్పునకు ముందు ఆదివారం రాత్రి రాజధాని ఢాకా సహా పలు నగరాలు వరుస పేలుళ్లు, దహనం ఘటనలతో దద్దరిల్లాయి. గతేడాది జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరుతోంది.

ప్రస్తుతం భారత్‌లో ప్రవాసంలో ఉన్న షేక్ హసీనా, తనపై జరుగుతున్న విచారణను రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి అవామీ లీగ్ ఫేస్‌బుక్ పేజీలో ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినా, తన మద్దతుదారులు నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. "భయపడాల్సిన పనిలేదు. నేను బతికే ఉన్నాను. దేశ ప్రజలకు అండగా ఉంటాను" అని ఆమె ధైర్యం చెప్పారు. ఈ విచారణను ‘కంగారూ కోర్టు’ (అనధికార న్యాయస్థానం)గా అభివర్ణించిన హసీనా.. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనుస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో హత్యలకు ఆదేశాలు ఇచ్చింది తాను కాదని, యూనుస్ అని ఆమె ఆరోపించారు.

హసీనా పిలుపు మేరకు అవామీ లీగ్ సోమవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు, తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు నివాసం వెలుపల రెండు కచ్చా బాంబులు పేలాయి. పలు ప్రాంతాల్లో బస్సులకు నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లకు పాల్పడితే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఢాకా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

గతేడాది ఆగస్టులో జరిగిన ఈ విద్యార్థి ఉద్యమంలో హింస చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోగా, షేక్ హసీనా 15 ఏళ్ల పాలన ముగిసింది. అప్పటి నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా, తమ పార్టీని నిషేధిస్తే ఎన్నికలను అడ్డుకుంటామని హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ హెచ్చరించారు.
Sheikh Hasina
Bangladesh
International Crimes Tribunal
ICT
Awami League
Dhaka
Student Protests
Political unrest
Sajeeb Wazed
Mohammad Yunus

More Telugu News