RGL 7034: సన్న బియ్యం సాగులో కొత్త ఆశ.. తుపానును తట్టుకునే కొత్త వరి వంగడం ‘ఆర్‌జీఎల్‌ 7034’

RGL 7034 Rice Variety Benefits Guntur Farmer Mohan Reddy
  • సన్న బియ్యం కొరతను అధిగమించేందుకు కొత్త వరి వంగడం ఆవిష్కరణ
  • ఆర్‌జీఎల్‌ 7034 పేరుతో వంగడాన్ని రూపొందించిన డాక్టర్ పీవీ సత్యనారాయణ
  • బీపీటీ కన్నా అధిక దిగుబడి, తెగుళ్లు, తుపానును తట్టుకునే సామర్థ్యం
  • రైతు పొలంలో ప్రయోగాత్మక సాగు విజయవంతం

ఆంధ్రప్రదేశ్ లో సన్న బియ్యానికి రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఓ కొత్త వరి వంగడాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ‘ఆర్‌జీఎల్‌ 7034’ పేరుతో రూపొందించిన ఈ రకం.. అధిక దిగుబడి ఇవ్వడమే కాకుండా తెగుళ్లు, ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా తట్టుకుంటోంది. భవిష్యత్తులో సన్న బియ్యం కొరతను అధిగమించేందుకు ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వర్సిటీ పరిశోధనా సంచాలకులు, ఎంఎస్ స్వామినాథన్ అవార్డు గ్రహీత డాక్టర్ పీవీ సత్యనారాయణ ఈ కొత్త వంగడానికి రూపకల్పన చేశారు. ఎన్‌ఎల్‌ఆర్‌ 34449 రకాన్ని చిట్టి ముత్యాలతో సంకరణం చేసి దీన్ని అభివృద్ధి చేశారు. 140 రోజుల పంట కాలం ఉండే ఈ రకం.. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడిని ఇస్తుంది. ప్రస్తుతం రైతులు ఎక్కువగా సాగు చేస్తున్న బీపీటీ 5204 రకంతో పోలిస్తే ఇది ఎకరాకు 10-15 బస్తాలు అధికం. అంతేకాకుండా దోమ పోటు, ఎండాకు తెగులును తట్టుకోవడంతో పాటు ఇటీవల సంభవించిన మొంథా తుపాన్‌కు కూడా పంట పొలాల్లో పడిపోలేదని పరిశీలనలో తేలింది.

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంకు చెందిన రైతు ఆళ్ల మోహన్‌రెడ్డి తన పొలంలో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. తుపాన్ సమయంలో తన పొలంలోని ఆర్‌జీఎల్‌ 7034 పైరు నిలబడగా, పక్కనే ఉన్న బీపీటీ రకం పూర్తిగా నేలకొరిగిందని ఆయన తెలిపారు.

ఈ కొత్త వంగడంపై రైతు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. "నేను ఇప్పటివరకు 40 సన్న రకాలు సాగు చేశాను. ఆర్‌జీఎల్‌ 7034 నిజంగా ఓ గేమ్ చేంజర్. పెట్టుబడి, తెగుళ్లు చాలా తక్కువ. ఎకరాకు ఒక్క బస్తా యూరియా మాత్రమే వాడాను. ఒక్కసారే పురుగుమందు పిచికారీ చేశాను. తుపాను వచ్చినా పైరు పడిపోలేదు" అని తన అనుభవాన్ని వివరించారు. డాక్టర్ సత్యనారాయణ రూపొందించిన వరి వంగడాలు ఇప్పటికే దేశంలోని 16 రాష్ట్రాల్లో సాగవుతుండటం విశేషం.
RGL 7034
Mohan Reddy
Guntur
Andhra Pradesh
Rice Cultivation
High Yield Rice
Duggirala
Veerlapalem
Kharif Season
Rice Variety

More Telugu News