Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సినిమాటిక్ ట్విస్ట్.. దొంగ సొమ్మునే దోచేసిన కిలాడీ గ్యాంగ్!

Liquor Scam Cinematic Twist Gang Steals Stolen Money
  • గత ప్రభుత్వ మద్యం స్కామ్‌లో భారీ దోపిడీ బట్టబయలు
  • హైదరాబాద్‌లో దాచిన కోట్ల రూపాయల నగదును చోరీ చేసిన మహిళ
  • ఒడిశా, హైదరాబాద్‌లలో రూ.5.10 కోట్ల ఆస్తుల గుర్తింపు
  • ఆస్తులను జప్తు చేసేందుకు రంగం సిద్ధం చేసిన సిట్ అధికారులు
ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణంలో మరో ఆసక్తికర కోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌లో అక్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయల సొమ్మును ఓ ముఠా సినిమా ఫక్కీలో దోచుకున్నట్లు సిట్ విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు కొట్టేసిన డబ్బుతో కొనుగోలు చేసిన రూ.5.10 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

లిక్కర్ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి గ్యాంగ్‌లోని సైమన్ ప్రసన్ వసూళ్లకు సంబంధించిన డబ్బును హైదరాబాద్‌లోని తన బంధువు మోహన్ ఇంట్లో పెట్టెల్లో దాచేవాడు. ఆ సమయంలో అక్కడే ఉంటున్న మోహన్ బంధువు అనిల్ ప్రియురాలు, ఒడిశాకు చెందిన రషిత అనే యువతి ఈ డబ్బును గుర్తించింది. తన మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్‌తో కలిసి డబ్బును కాజేయడానికి పథకం రచించింది.

2023 జనవరి 13న ఇర్షాద్ తన గ్యాంగ్‌తో కలిసి మోహన్ ఇంట్లోకి చొరబడి సుమారు 6 పెట్టెల నగదును దొంగిలించాడు. అనంతరం ఆ డబ్బుతో వారు ఒడిశాలోని కటక్‌కు పారిపోయారు. ఈ చోరీ విషయం బయటకు రాకుండా సైమన్ గ్యాంగ్ ప్రయత్నించినా, సిట్ విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు కటక్‌లో విచారణ జరపగా, రషిత, ఇర్షాద్ ఆ డబ్బుతో ఇళ్లు, ఇతర ఆస్తులు కొన్నట్లు తేలింది.

ఈ కేసులో మరో ట్విస్ట్ ఏమిటంటే, దొంగతనానికి సహకరించిన హైదరాబాద్ వాసి ముబారక్ అలీ కూడా రెండు పెట్టెలను కాజేసి, దాంతో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో కటక్‌లో సుమారు రూ.4 కోట్లు, హైదరాబాద్‌లో రూ.కోటికి పైగా విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు సిట్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ వారంలోనే విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Liquor Scam
Andhra Pradesh
AP Liquor Scam
Raj Kasireddy
Cyberabad SIT
Money Laundering
Hyderabad
Vijayawada ACB Court
Corruption
Rashita

More Telugu News