ఎర్రకోట పేలుడు.. ఘటనా స్థలంలో సైన్యం బుల్లెట్లు.. విచారణ ముమ్మరం

  • ఘటనా స్థలంలో 9 ఎంఎం బుల్లెట్లు స్వాధీనం
  • బుల్లెట్లు భద్రతా సిబ్బందివి కావని నిర్ధారణ
  • రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్ వాడినట్లు గుర్తింపు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తు బృందాలు విచారణను వేగవంతం చేశాయి. ఈ కేసులో కీలక ఆధారాలు లభించాయి. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇవి సైనికులు వాడే 9 ఎంఎం కాట్రిడ్జ్‌లు అని వెల్లడించారు. అయితే, ఆ ప్రదేశంలో ఎలాంటి తుపాకీ లభ్యం కాలేదని స్పష్టం చేశారు.

ఘటనా స్థలంలో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు, భద్రతా సిబ్బందికి అందించిన బుల్లెట్లను పరిశీలించామని, స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు వారికి సంబంధించినవి కావని పోలీసులు ధ్రువీకరించారు. దీంతో భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు అక్కడికి ఎలా వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై స్పష్టత కోసం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సోమవారం ఎర్రకోట మెట్రోస్టేషన్ సిగ్నల్ వద్ద జరిగిన ఈ పేలుడులో సుమారు రెండు కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు నిర్ధారించారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిలో బుల్లెట్లతో పాటు రెండు వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్‌ నబీతో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కారులో ఇంకా ఎవరైనా ఉన్నారా, పేలుడు పదార్థాలను ఎక్కడ నింపారనే వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.


More Telugu News