తండ్రైన బాలీవుడ్ స్టార్ రాజ్ కుమార్ రావ్.. పండంటి పాపకు జన్మనిచ్చిన పత్రలేఖ

  • సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన జంట
  • నాలుగో వివాహ వార్షికోత్సవం రోజున శుభవార్త పంచుకున్న దంపతులు 
  • రాజ్ కుమార్, పత్రలేఖలకు శుభాకాంక్షలు తెలుపుతున్న బాలీవుడ్ ప్రముఖులు
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్, ఆయన భార్య, నటి పత్రలేఖ దంపతులు తల్లిదండ్రులయ్యారు. పత్రలేఖ నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఈ జంట సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తమ నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఈ శుభవార్తను వెల్లడించడం విశేషం.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. "మా నాలుగో వివాహ వార్షికోత్సవం నాడు దేవుడు మాకు ప్రసాదించిన గొప్ప ఆశీర్వాదం ఇది. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి" అని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 'తల్లిదండ్రుల క్లబ్‌లోకి మీకు స్వాగతం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కొంతకాలం పాటు ప్రేమించుకున్న రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ 2021లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజ్ కుమార్ రావ్ ఇటీవల 'మాలిక్', 'భూల్ చుక్ మాఫ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించారు. 


More Telugu News