వైట్ కాలర్ టెర్రరిస్టులపై ఫరూక్ వ్యాఖ్యల దుమారం.. బీజేపీ తీవ్ర స్పందన

  • వైట్ కాలర్ టెర్రరిస్టులపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
  • డాక్టర్లు ఎందుకు ఉగ్రవాదం వైపు వెళ్తున్నారో విచారణ జరపాలని వ్యాఖ్య
  • మరో 'ఆపరేషన్ సిందూర్' జరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసిన అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఒకే రోజు రెండు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రాజకీయంగా కలకలం రేపారు. హర్యానాలో ఇటీవల పట్టుబడిన 'వైట్ కాలర్' టెర్రరిస్ట్ మాడ్యూల్‌లో డాక్టర్లు ఉండటంపై ఆయన స్పందిస్తూ, వారు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారో లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు.

"చదువుకున్న డాక్టర్లు ఈ దారి పట్టడానికి కారణాలేంటి? దీని వెనుక ఎవరున్నారు? అనే విషయాలపై సమగ్రమైన విచారణ జరిపి, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది" అని అబ్దుల్లా అన్నారు. ఈ టెర్రరిస్ట్ మాడ్యూల్ అరెస్టుల నేపథ్యంలో మరో 'ఆపరేషన్ సిందూర్' లాంటిది జరుగుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "గతంలో ఆపరేషన్ సిందూర్ వల్ల మనం సాధించింది ఏమీ లేదు. ఢిల్లీ పేలుళ్లలో మనవాళ్లు 18 మంది చనిపోయారు. పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడమే ఉత్తమం. స్నేహితులను మార్చుకోవచ్చు కానీ... పొరుగువారిని మార్చుకోలేమన్న వాజ్ పేయి వ్యాఖ్యలను ఈసందర్భంగా గుర్తు చేస్తున్నా" అని ఆయన వ్యాఖ్యానించారు.

అలాగే, శుక్రవారం రాత్రి శ్రీనగర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో పేలుడు పదార్థాలు పేలి 9 మంది మృతి చెందిన ఘటనపై స్పందిస్తూ.. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. "ఉగ్రవాదుల కోసం కన్నీళ్లు కార్చడం ఆయనకు పాత అలవాటే. ఇకనైనా వారి తరఫున మాట్లాడటం ఆపాలి" అని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఘాటుగా బదులిచ్చారు.

కాగా, ఫోరెన్సిక్ ప్రక్రియలో భాగంగా పేలుడు పదార్థాలను తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై అనవసర ఊహాగానాలు వద్దని జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ స్పష్టం చేశారు.


More Telugu News