బాలకృష్ణ అనుచరులు హిందూపురం వైసీపీ ఆఫీసును ధ్వంసం చేశారు: జగన్

  • హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన జగన్
  • ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణన
  • టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు దాడి చేశారని ఆరోపణ
  • పోలీసుల నిర్లక్ష్యంపై జగన్ తీవ్ర ఆగ్రహం
  • చంద్రబాబు రాజకీయ అజెండా కోసమే పోలీసుల దుర్వినియోగం
  • ప్రతిపక్షాల హక్కులను కాపాడలేని ప్రభుత్వానికి నైతిక హక్కు లేదన్న జగన్
హిందూపురంలోని వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యంపైనే జరిగిన ఒక క్రూరమైన దాడి అని ఆయన అభివర్ణించారు. టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు సాగించిన ఈ దౌర్జన్యం అత్యంత హేయమైన, ఆటవిక చర్య అని మండిపడ్డారు. రాజకీయ పార్టీలే కార్యాలయాలను ధ్వంసం చేయడం, ఫర్నిచర్‌ను పగలగొట్టడం, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడటం వంటివి ప్రజాస్వామ్య విలువలు ప్రమాదకర స్థాయిలో పతనమయ్యాయనడానికి నిదర్శనమని జగన్ ట్వీట్ చేశారు.

ఈ దాడి సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత ఆందోళనకరమని జగన్ విమర్శించారు. వారి నిశ్శబ్దం కేవలం నిర్లక్ష్యం కాదని, అది ఒక హెచ్చరిక అని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ అజెండా కోసం బహిరంగంగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యమని ఆరోపించారు. పోలీసుల ప్రేక్షకపాత్ర వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

హిందూపురంలో టీడీపీ ప్రదర్శించిన ఈ క్రూరత్వం, చంద్రబాబు నాయకత్వం ఏ విధంగా గుంపులను రెచ్చగొడుతుందో, హింసను ఎలా ప్రోత్సహిస్తుందో స్పష్టం చేస్తోందని జగన్ పేర్కొన్నారు. భయం, దౌర్జన్యాలతో రాజకీయ ప్రత్యర్థులను అణచివేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రభుత్వం తన ప్రత్యర్థుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను కూడా కాపాడలేనప్పుడు, ఇక పాలన గురించి మాట్లాడే నైతిక హక్కును పూర్తిగా కోల్పోయినట్టేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది కేవలం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను విశ్వసించే ప్రతి పౌరుడిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని జగన్ తన ప్రకటనలో స్పష్టం చేశారు.


More Telugu News