ఏపీకి వస్తున్న కంపెనీలు ఇవే... ఒక్క ఫొటోతో కళ్లకు కట్టిన అచ్చెన్నాయుడు!

  • ఏపీకి వస్తున్న కంపెనీల జాబితాతో మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్
  • విశాఖ సదస్సు యువత భవిష్యత్తుకు గేమ్ చేంజర్ అని వెల్లడి
  • రెండు రోజుల సదస్సులో 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ
  • అంచనాలను మించి రూ.11.91 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ
  • సీఎం చంద్రబాబు సమక్షంలో రెండో రోజు కీలక ఒప్పందాలు
  • అదానీ, హెట్రో, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలతో ఎంఓయూలు
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు భారీ విజయం సాధించింది. ఈ సదస్సు రాష్ట్ర యువత భవిష్యత్తుకు 'గేమ్ చేంజర్' అని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన పలు దిగ్గజ కంపెనీల పేర్లు, లోగోలతో కూడిన ఒక ఫొటోను ఆయన తన ట్వీట్‌కు జోడించి, సదస్సు ద్వారా 13.32 లక్షల ఉద్యోగాలకు హామీ లభించిందని స్పష్టం చేశారు.

విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ప్రభుత్వం తొలుత రూ.9.76 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 7.48 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. అయితే, అంచనాలకు మించి మొదటి రోజు ముగిసేసరికే 400 ఒప్పందాల ద్వారా రూ.11,91,972 కోట్ల విలువైన పెట్టుబడులు, 13,32,445 ఉద్యోగాలకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి.

సదస్సు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మరో 48 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) జరిగాయి. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.48,430 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 94,155 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థలలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, హెట్రో డ్రగ్స్, భారత్ డైనమిక్స్, జేకే ఏరోస్పేస్, అదానీ విల్మర్, ఎన్ఎస్‌టీఎల్ క్వాంటం కంప్యూటింగ్ స్టిమ్యులేటింగ్ సెంటర్, సీడాక్, పాస్కల్ వంటివి ఉన్నాయి. ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది.


More Telugu News