ఓటు హక్కు: జెన్ జెడ్ యువతకు నటుడు విజయ్ కీలక సందేశం

  • వీడియోను విడుదల చేసిన నటుడు విజయ్
  • ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని సూచన
  • రాజ్యాంగం ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కులలో ఓటు హక్కు ఒకటి అన్న విజయ్
ఎస్ఐఆర్ అంశంలో ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రజలలో గందరగోళం నెలకొందని టీవికే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ప్రజలు, ముఖ్యంగా జెన్-జెడ్ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎస్ఐఆర్ తర్వాత నవీకరించబడిన ఓటరు జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని కోరారు.

భారత రాజ్యాంగం ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కులలో ఓటు హక్కు ఒకటని విజయ్ పేర్కొన్నారు. ఈ దేశ పౌరుడిగా జీవించేందుకు ఓటు హక్కు చాలా అవసరమని అన్నారు. ఓటు హక్కు లేకపోతే మన ప్రజాస్వామ్యం అసంపూర్ణమే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో చాలామంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ ప్రచురించే ఓటరు జాబితాలో మన పేర్లు కనిపిస్తేనే ఓటు వేయగలమని గుర్తుంచుకోవాలని సూచించారు.

తమిళనాడులో 6.36 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, కానీ ఎస్ఐఆర్ ప్రక్రియను నెలలోపు ఎలా పూర్తి చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు తమ పార్టీకి చెందిన చాలామందికి ఫారమ్‌లు అందలేదని అన్నారు. అందుకే ఎస్ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. భౌతిక ఫారమ్ అందుకోలేని వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్పుడే ఓటరు జాబితాలో మన పేరు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

యువత ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరగవచ్చని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో జెన్ జెడ్ ఓటర్లు నిర్ణయాత్మక పాత్రను పోషిస్తారని, అందుకే వారికి జాబితాలో చోటు లేకుండా ప్రయత్నాలు చేయవచ్చని అన్నారు. ఓటు అనేది అత్యంత శక్తిమంతమైన ప్రజాస్వామ్య సాధనమని గుర్తుంచుకోవాలని ఆయన ఉద్బోధించారు. మన ఓటు మన ప్రజాస్వామ్య ఆయుధమని పేర్కొన్నారు. "జెన్ జెడ్ ఒక శక్తి. వారు అప్రమత్తంగా ఉండాలి. అంతా మంచి జరుగుతుంది. విజయం ఖాయం" అని విజయ్ తన వీడియోను ముగించారు.


More Telugu News