బీహార్‌లో ఓటమి వేళ లాలూ ప్రసాద్‌కు మరో షాక్... రాజకీయాలకు, కుటుంబానికి కుమార్తె గుడ్‌బై!

  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రోహిణి ఆచార్య
  • కుటుంబంతోను సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటన
  • తేజస్వి యాదవ్ సన్నిహితులు తనను ఇలా చేయమని ఆదేశించారని వ్యాఖ్య
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, కుటుంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన 2025 బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలై కేవలం 25 సీట్లకు పరిమితమైంది. మొత్తం 243 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 202 స్థానాలు గెలుచుకుని విజయం సాధించింది. ఈ ఓటమి నుంచి తేరుకోకముందే లాలూ ప్రసాద్ యాదవ్‌కు కుమార్తె రోహిణి ఆచార్య షాకిచ్చారు.

రాజకీయాలకు, కుటుంబానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. "నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. అదే విధంగా నా కుటుంబంతో కూడా సంబంధాలు తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ నన్ను ఇదే చేయమని అడిగారు" అంటూ ఆమె ఒక సంచలన ట్వీట్‌ చేశారు. తేజస్వి యాదవ్‌కు సన్నిహితులైన సంజయ్ యాదవ్ తనను తప్పుకోమని చెప్పారని ఆమె ఆరోపించారు.

ఇలా ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయం పాలైన సమయంలో రోహిణి ఆచార్య ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోహిణి ఆచార్య వృత్తీరీత్యా వైద్యురాలు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని సరన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ చేతిలో ఓటమి పాలయ్యారు.


More Telugu News