రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ.. జూబ్లీహిల్ కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరు

  • సమావేశానికి హాజరైన భట్టి, మహేశ్ గౌడ్
  • జూబ్లీహిల్స్ విజయం, రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చ
  • త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలపైనా చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కీలక సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ గెలుపు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై నేతలు చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం అసంతృప్తితో ఉందంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కావడం ఆ ఊహాగానాలకు తెరదించినట్లయింది. ఈ సమావేశం ద్వారా పార్టీలో నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందని అధిష్ఠానం సంకేతాలు పంపినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News