కృత్రిమ మేధపై మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ త్రిముఖ వ్యూహం వెల్లడి

  • కృత్రిమ మేధతో ఉద్యోగాలకు ముప్పు లేదన్న మంత్రి నారా లోకేశ్
  • ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వ్యాఖ్య
  • 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ధ్యేయమని స్పష్టీకరణ
కృత్రిమ మేధ (ఏఐ) మానవాళికి ముప్పు కాదని, అది మానవత్వాన్ని మరింతగా తీర్చిదిద్దుతుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రతి పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన తెలిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో రెండో రోజు ‘ఏఐ-భవిష్యత్తులో ఉద్యోగాలు’ అనే అంశంపై జరిగిన చర్చలో లోకేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఏఐని అందిపుచ్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు విధాలుగా ముందుకెళ్తోంది. పునఃనైపుణ్యం (Re-skill), పునర్నిర్వచించడం (Redefine), పునఃఊహించడం (Re-imagine) అనే త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 'నైపుణ్యం' అనే ప్లాట్‌ఫామ్‌ను కూడా రూపొందించాం" అని వివరించారు.

ఐటీ రంగం ద్వారానే పారిశ్రామికవేత్తలు వేగంగా అభివృద్ధి సాధిస్తారని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వ్యాపారవేత్తల ఆదాయాన్ని గణనీయంగా పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 

"నెలకు రూ.50 వేలు సంపాదించే వ్యాపారవేత్త రూ.లక్ష సంపాదించేలా, రూ.5 లక్షలు సంపాదిస్తుంటే దానిని రూ.25 లక్షలకు పెంచేలా ప్రోత్సహిస్తాం. ఇలా చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చగలుగుతాం" అని ఆయన అన్నారు. 

రాష్ట్రంలోని వ్యాపారవేత్తలతో కలిసి పనిచేసేందుకు ప్రభుత్వం ఉత్సాహంగా ఉందని, అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్ హామీ ఇచ్చారు.


More Telugu News