విశాఖ సీఐఐ సదస్సు అతిథుల కోసం నోరూరించే వంటకాలు... ఫుడ్ మెనూ ఇదే!

  • విశాఖ సీఐఐ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విందు భోజనాలు
  • దేశ, విదేశీ ప్రతినిధులను ఆకట్టుకున్న సంప్రదాయ ఆంధ్రా వంటకాలు
  • గుంటూరు కోడి కూర, బొమ్మిడాయిల పులుసు వంటి 20కి పైగా వెరైటీలు
  • ప్రత్యేకంగా ఆకట్టుకున్న అరిసెలు, పూతరేకులతో కూడిన డెజర్ట్ కౌంటర్
  • రెండు రోజుల సదస్సు కోసం విడివిడిగా భారీ మెనూ ఏర్పాటు
  • ఏపీ ప్రభుత్వ ఆతిథ్యంపై అతిథుల నుంచి ప్రశంసల వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు కేవలం పారిశ్రామిక ఒప్పందాలకే కాకుండా, అద్భుతమైన ఆతిథ్యానికి కూడా వేదికగా నిలిచింది. ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఈ సదస్సుకు హాజరైన దేశ, విదేశాలకు చెందిన సుమారు 3,000 మంది ప్రతినిధులు ఏపీ ప్రభుత్వ ఆతిథ్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా, ఆంధ్ర సంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన విందు ఈ సదస్సుకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నోరూరించే వెజ్, నాన్‌వెజ్ వంటకాలను రుచి చూసిన అతిథులు, ఏపీ రుచులకు మంత్రముగ్ధులయ్యారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, తెలుగు వారి సంస్కృతిని, సంప్రదాయాలను, ముఖ్యంగా ఇక్కడి వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేసింది. తొలిరోజు, రెండోరోజు వేర్వేరు మెనూలతో అతిథులను ఆకట్టుకుంది. మొత్తం 20కి పైగా రకాలతో కూడిన వంటకాలను వడ్డించారు. విశాలమైన మూడు హాళ్లలో ప్రత్యేకంగా భోజన ఏర్పాట్లను జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ స్వయంగా పర్యవేక్షించారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు టీ, కాఫీలను అందుబాటులో ఉంచారు.

ప్రత్యేక ఆకర్షణగా ‘ఆంధ్ర డెజర్ట్ కౌంటర్’

ఈ విందులో ‘ఆంధ్ర డెజర్ట్ కౌంటర్’ అతిథులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అచ్చ తెలుగు సంప్రదాయ పిండివంటలైన అరిసెలు, తీపి కాకినాడ కాజా, నోట్లో వేస్తే కరిగిపోయే పూతరేకులను ఉంచారు. విదేశీ ప్రతినిధులు ఈ స్వీట్లను ఎంతో ఇష్టంగా ఆరగించారు.

తొలిరోజు విందు మెనూ ఇదే

శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విందులో వడ్డించిన వంటకాల జాబితా ఇక్కడ ఉంది.

నాన్‌ వెజ్: గుంటూరు కోడి వేపుడు, బొమ్మిడాయిల పులుసు, రొయ్యల మసాలా, హైదరాబాద్ మటన్ దమ్ బిర్యానీ, చికెన్ పలావ్, గ్రిల్ల్డ్ ఫిష్.
వెజ్: ఉలవచారు, పన్నీర్ బటర్ మసాలా, మష్రూం క్యాప్సికం కర్రీ, ఆలూ గార్లిక్ ఫ్రై, క్యాబేజీ మటర్ ఫ్రై, వెజ్ పలావ్, మెంతికూర-కార్న్ రైస్, టొమాటో పప్పు, బీట్‌రూట్ రసం, మజ్జిగ పులుసు, రోటీ, కుల్చా, వెజిటబుల్ థాయ్ బాసిల్ నూడుల్స్.
ఇతరాలు: గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి.
స్వీట్స్: కాలా జామున్, జున్ను, కట్ ఫ్రూట్స్, ఐస్ క్రీం, పేస్ట్రీలు.

రెండో రోజు మెనూ విశేషాలు

శనివారం కూడా అతిథుల కోసం భారీ మెనూను సిద్ధం చేశారు.

నాన్‌ వెజ్: గోంగూర రొయ్యల కూర, చేప ఫ్రై, మటన్‌ పలావ్‌, ఆంధ్రా చికెన్‌ కర్రీ, ఎగ్‌ మసాలా.
వెజ్: వెజ్‌ బిర్యానీ, క్యారెట్‌ బీన్స్‌ కొబ్బరి ఫ్రై, కరివేపాకు రైస్, కడాయ్‌ పన్నీర్, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, ఉలవచారు క్రీం, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, బటర్‌ నాన్‌, రుమాలి రోటీ.
స్వీట్స్: డబుల్‌ కా మీఠా, బ్రౌనీ, అంగూర్‌ బాసుంది, గులాబ్‌ జామ్, ఐస్‌క్రీం, కట్‌ ఫ్రూట్స్.

ఈ రుచికరమైన విందుతో ఏపీ ప్రభుత్వం కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా, తమ ఘనమైన సంస్కృతిని, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలోనూ విజయం సాధించిందని పలువురు ప్రశంసించారు.


More Telugu News