కరిష్మా పిల్లల ఫీజులు కట్టలేదంటూ ప్రియా సచ్‌దేవ్ పై ఆరోపణలు.. కోర్టులో కీలక వాదనలు!

  • దివంగత సంజయ్ కపూర్ రూ.30 వేల కోట్ల ఆస్తిపై కొనసాగుతున్న వివాదం
  • సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్‌పై పిల్లల ఆరోపణలు
  • ఆరోపణలను ఖండించిన ప్రియా తరఫు న్యాయవాది
  • విచారణను మెలోడ్రామాగా మార్చొద్దని హైకోర్టు హెచ్చరిక
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుటుంబంలో ఆస్తి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తన పిల్లల చదువుకు సంబంధించిన ఫీజులను గత రెండు నెలలుగా చెల్లించడం లేదని ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

కరిష్మా దివంగత భర్త సంజయ్ కపూర్‌కు చెందిన రూ.30 వేల కోట్ల ఆస్తిలో వాటా కోరుతూ ఆయన పిల్లలు సమైరా, కియాన్‌లు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు రాగా, పిల్లల తరఫు న్యాయవాది మహేశ్ జఠ్మలాని వాదనలు వినిపించారు. ఆస్తులన్నీ ప్రస్తుతం పిల్లల సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ నియంత్రణలో ఉన్నాయని, అమెరికాలో చదువుతున్న సమైరాకు రెండు నెలలుగా ఫీజులు చెల్లించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే, ప్రియా సచ్‌దేవ్ తరఫు న్యాయవాది రాజీవ్ నాయర్ ఈ ఆరోపణలను ఖండించారు. ఇవన్నీ కల్పితాలని, ఫీజులు ఇప్పటికే చెల్లించామని తెలిపారు. కేవలం మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఈ అంశాన్ని లేవనెత్తారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్, కేసు విచారణను మెలోడ్రామాగా మార్చవద్దని గట్టిగా హెచ్చరించారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలను కోర్టు బయటే పరిష్కరించుకోవాలని సూచించారు.

2003లో వివాహం చేసుకున్న కరిష్మా, సంజయ్ కపూర్‌లు 2016లో విడాకులు తీసుకున్నారు. సంజయ్ మరణం తర్వాత ఆయన ఆస్తుల కోసం వివాదం మొదలైంది. తమ సవతి తల్లి ప్రియా సచ్‌దేవ్ నకిలీ వీలునామా సృష్టించిందని పిల్లలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై విచారణ ఇంకా కొనసాగుతోంది. 


More Telugu News