ప్రభుత్వంతో 21 ఏళ్ల యువతి ఒప్పందం.. కర్నూలు డ్రోన్ సిటీలో కీలక ప్రాజెక్ట్

  • విశాఖ సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న యువ‌తి
  • కర్నూలు డ్రోన్ సిటీలో ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎంఓయూ
  • విజయవాడకు చెందిన 21 ఏళ్ల ధవళ సాయి ప్రతిభ
  • ఒకే డివైజ్‌తో వంద డ్రోన్లను నియంత్రించే టెక్నాలజీ
  • అల్గోబొటిక్స్ సంస్థ తరఫున ఒప్పందంపై సంతకం
విజయవాడకు చెందిన 21 ఏళ్ల ధవళ సాయి అనే యువతి టెక్నాలజీ రంగంలో తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. కర్నూలులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న డ్రోన్‌ సిటీలో తమ ప్రాజెక్టును నెలకొల్పేందుకు గాను, విశాఖలో జరిగిన సదస్సులో ప్రభుత్వంతో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో నిన్న‌ ఈ ఎంఓయూ పత్రాలను మార్చుకున్నారు.

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఇంటర్న్‌షిప్ చేసిన ధవళ సాయి, అక్కడి ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. డ్రోన్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించిన ఆమె, ప్రముఖ సైంటిస్ట్ ఘోష్, కో-ఫౌండర్ ఓంకార్ చోప్రాతో కలిసి 'అల్గోబొటిక్స్' సంస్థ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె తన ఆలోచనలను పంచుకున్నారు. "ప్రస్తుతం ఏపీలో డ్రోన్లను ఎక్కువగా వ్యవసాయంలో వాడుతున్నారు. త్వరలో వైద్య అత్యవసర సేవలు, సరుకుల డెలివరీకి కూడా డ్రోన్ల వినియోగం పెరుగుతుంది. ప్రస్తుతం ఒక్కో డ్రోన్‌ను ఒక్కో పైలట్ నియంత్రించాల్సి వస్తోంది. కానీ, ఒకే డివైజ్‌తో వందకు పైగా డ్రోన్లను నియంత్రించే టెక్నాలజీపై మా కంపెనీ పనిచేస్తోంది" అని ఆమె వివరించారు. బిజినెస్ ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తిచేసిన సాయి, టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టి రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం విశేషం.


More Telugu News