గెలిచేవరకు మాస్క్ తీయనని చెప్పింది.. చివరికి ఓడిపోయింది!

  • ప్లూరల్స్ పార్టీ చీఫ్‌కు పరాజయం
  • దర్భంగా నియోజకవర్గంలో ఎనిమిదో స్థానానికి పరిమితం
  • ఆమెపై బీజేపీ అభ్యర్థి సంజయ్ సరావ్గీ విజయం
  • ఓటమితో మాస్క్ తొలగిస్తారా అంటూ నెటిజన్ల ప్రశ్నలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే వరకు మాస్క్ తీయనని శపథం చేసిన ప్లూరల్స్ పార్టీ అధ్యక్షురాలు పుష్పమ్ ప్రియా చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. దర్భంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఘోర పరాజయం పాలై ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సంజయ్ సరావ్గీ గెలుపొందారు. గత ఎన్నికల్లోనూ ఆయనే ఇక్కడి నుంచి విజయం సాధించడం గమనార్హం.

కుల, మత రాజకీయాలకు భిన్నంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానంటూ పుష్పమ్ ప్రియ 2020లో 'ద ప్లూరల్స్ పార్టీ'ని స్థాపించారు. ఈసారి ఎన్నికల్లో విజిల్ గుర్తుపై మొత్తం 243 స్థానాల్లోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పుష్పమ్ ప్రియకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తండ్రి వినోద్ కుమార్ చౌదరి జేడీయూ నేత, మాజీ ఎమ్మెల్యే. ఆమె తాతయ్య ఉమాకాంత్ చౌదరి, సీఎం నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితులు.

అయినప్పటికీ, 2020 ఎన్నికల్లోనూ ఆమె పార్టీ 148 స్థానాల్లో పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. ఎప్పుడూ నల్లటి దుస్తులు ధరించి, మాస్క్‌‌తో కనిపించే ఆమె, ఎన్నికల్లో గెలిచాకే మాస్క్ తీస్తానని ప్రచారం చేశారు. ఇప్పుడు ఓటమి పాలు కావడంతో తన శపథాన్ని ఏం చేస్తారని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 


More Telugu News