ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ... 42 బంతుల్లోనే 144 రన్స్

  • ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో ఇండియా-ఏ శుభారంభం
  • వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం
  • 11 ఫోర్లు, 15 సిక్సర్లతో సునామీ
  • కెప్టెన్ జితేష్ శర్మ అద్భుత అర్ధశతకం... 32 బంతుల్లో 83 నాటౌట్
  • యూఏఈ ముందు 298 పరుగుల కొండంత లక్ష్యం
  • బంతితో రాణించిన గుర్జపనీత్ సింగ్... 3 వికెట్లు కైవసం
  • 148 పరుగుల తేడాతో యూఏఈపై ఇండియా-ఏ ఘనవిజయం
ఏసీసీ మెన్స్ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా-ఏ జట్టు అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో జరిగిన టీ20 మ్యాచ్‌లో యువ భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి 148 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన విధ్వంసకర శతకం, కెప్టెన్ జితేష్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఈ విజయానికి ప్రధాన కారణమయ్యాయి.

దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఏ కెప్టెన్ జితేష్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (10) రనౌట్‌గా వెనుదిరగడంతో భారత్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, మరో బ్యాటర్ నమన్ ధీర్‌తో కలిసి యూఏఈ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా సూర్యవంశీ ఆడిన తీరు విధ్వంసాన్ని తలపించింది. కేవలం 42 బంతులు ఎదుర్కొన్న అతను ఏకంగా 11 ఫోర్లు, 15 సిక్సర్లతో 144 పరుగులు చేశాడు. 342.86 స్ట్రైక్ రేట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. నమన్ ధీర్ (34)తో కలిసి రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 163 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు.

కెప్టెన్ జితేష్ శర్మ కూడా తనదైన శైలిలో చెలరేగాడు. కేవలం 32 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 83 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి ఇతర బ్యాటర్ల నుంచి కూడా సహకారం అందడంతో ఇండియా-ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 297 పరుగుల కొండంత స్కోరు సాధించింది. యూఏఈ బౌలర్లలో ప్రతీ ఒక్కరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం 298 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత పేసర్ గుర్జపనీత్ సింగ్ తన కచ్చితమైన బౌలింగ్‌తో యూఏఈ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. కేవలం 18 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. యూఏఈ జట్టులో సొహైబ్ ఖాన్ (41 బంతుల్లో 63) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో యూఏఈ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో గుర్జపనీత్‌కు తోడుగా హర్ష్ దూబే 2 వికెట్లు, యశ్ ఠాకూర్, రమణ్ దీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇండియా-ఏ టోర్నీలో తమ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది.


More Telugu News