ఏపీలో వ్యాక్సిన్ తయారీ యూనిట్... కీలక రంగాలపై మంత్రి నారా లోకేశ్ ఫోకస్

  • విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్ కీలక సమావేశాలు
  • వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని భారత్ బయోటెక్‌కు ఆహ్వానం
  • మెరైన్ పరికరాల యూనిట్‌పై సాగర్ డిఫెన్స్‌తో చర్చలు
  • విశాఖను డేటా సెంటర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేసిన లోకేశ్
  • అన్ని కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూల స్పందన
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం కేంద్రంగా పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. వ్యాక్సిన్ల తయారీ నుంచి అత్యాధునిక రక్షణ పరికరాలు, పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్ల వరకు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు డైనమిక్ నాయకత్వంలో రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉందని, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశామని మంత్రి లోకేశ్ కంపెనీలకు భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి: భారత్ బయోటెక్‌కు ఆహ్వానం

కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన 'కోవాక్సిన్' సృష్టికర్త, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన భారత్ బయోటెక్ సంస్థను ఏపీకి మంత్రి లోకేశ్ ఆహ్వానించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లాతో ఆయన సమావేశమయ్యారు. రోటావాక్, టైప్‌బార్ టీసీవీ వంటి అనేక వ్యాక్సిన్లను తయారుచేసి 80 దేశాలకు ఎగుమతి చేస్తున్న భారత్ బయోటెక్, రాష్ట్రంలో తమ తయారీ యూనిట్‌ను నెలకొల్పాలని లోకేశ్ కోరారు. 

రూ.3 వేల కోట్ల వార్షికాదాయంతో దేశంలోని టాప్-3 వ్యాక్సిన్ తయారీ సంస్థల్లో ఒకటిగా ఉన్న భారత్ బయోటెక్ రాకతో రాష్ట్ర ఫార్మా రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మలేరియా, చికెన్‌గున్యా, జికా వంటి వ్యాధులకు వ్యాక్సిన్ల రూపకల్పనపై పరిశోధనలు చేస్తున్నామని రేచస్ ఎల్లా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను తప్పకుండా పరిశీలిస్తామని వారు హామీ ఇచ్చారు.

మెరైన్ టెక్నాలజీకి ఏపీ సరైన గమ్యస్థానం: సాగర్ డిఫెన్స్‌తో లోకేశ్

మానవ రహిత సముద్ర వ్యవస్థలు, అటానమస్ వెసల్స్, డిఫెన్స్ సొల్యూషన్స్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందిన సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధులతోనూ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. 1,057 కిలోమీటర్ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని ఆయన వివరించారు.

సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని, మెరైన్ రోబోటిక్స్‌లో తమకు అనేక పేటెంట్లు ఉన్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్‌ను మెరైన్ రోబోటిక్స్‌లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ఏఐ, ఐఓటీ వంటి నూతన టెక్నాలజీలపై దృష్టి సారించాలని వారికి లోకేశ్ సూచించారు.

పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లపై దృష్టి

పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రసిద్ధి చెందిన 'వారీ' (WAREE) సంస్థ ప్రెసిడెంట్ అంకితా జోషి, సీఓఓ శ్యామ్ సుందర్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో 6 ఆపరేటింగ్ పోర్టులు, 6 విమానాశ్రయాలు, 5 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే లైన్లతో బలమైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని ఆయన వివరించారు. 

గూగుల్ సంస్థ విశాఖలో ఏఐ హబ్‌పై 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో, నగరం ఒక డేటా సెంటర్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పునరుత్పాదక ఇంధనం, డేటా సెంటర్లు, బ్యాటరీ స్టోరేజి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానం ద్వారా కేవలం 21 రోజుల్లోనే అన్ని అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన వారీ ప్రతినిధులు, త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు.

సుఖ్ భీర్ ఆవ్లాతోనూ మంత్రి లోకేశ్ భేటీ

ఇదే తరహాలో, ఎస్ఏఈఎల్ (SAEL) సంస్థ చైర్మన్ సుఖ్ భీర్ ఆవ్లాతోనూ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. ఇప్పటికే రాయలసీమలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టిన ఎస్ఏఈఎల్, ఇప్పుడు డేటా సెంటర్ హబ్‌గా మారుతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. 

వ్యవసాయ, మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తిలో తమకు నైపుణ్యం ఉందని, మౌలిక సదుపాయాల కల్పనలోనూ అపార అనుభవం ఉందని సుఖ్ భీర్ తెలిపారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలకు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు.


More Telugu News