బీహార్ ఎన్నికలు: సీమాంచల్‌లో పట్టు నిలుపుకున్న ఎంఐఎం.. 6 స్థానాల్లో ఆధిక్యం

  • బీహార్ ఎన్నికల్లో సత్తా చాటుతున్న ఎంఐఎం
  • సీమాంచల్ ప్రాంతంలో ఆరు స్థానాల్లో ఆధిక్యం
  • 2020లో గెలిచిన నాలుగు స్థానాల్లో మళ్ళీ ముందంజ
  • బీహార్‌లో ఎన్డీయే కూటమికి భారీ విజయం
  • 200 మార్కును దాటిన ఎన్డీయే కూటమి
  • ఘోరంగా విఫలమైన మహాఘట్‌బంధన్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తుండగా, అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఎంఐఎం పార్టీ తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ సత్తా చాటుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి వెలువడిన ఫలితాల సరళి ప్రకారం, ఎంఐఎం 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. జోకిహత్ (అరారియా), కోచాధామన్ (కిషన్‌గంజ్), అమౌర్ (పూర్ణియా), బైసి (పూర్ణియా), ఠాకూర్‌గంజ్ (కిషన్‌గంజ్), బహదూర్ గంజ్ స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. వీటిలో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుచుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవగా, వారిలో నలుగురు ఆర్జేడీలో చేరిపోయారు. పార్టీతో మిగిలిన ఏకైక ఎమ్మెల్యే, అమౌర్ అభ్యర్థి అక్తరుల్ ఇమాన్ ఈసారి కూడా తన స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇండియా కూటమిలో చోటు దక్కకపోవడంతో, రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవాలని ఎంఐఎం గట్టిగా ప్రయత్నించింది. తొలుత 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా, చివరకు ఇద్దరు ముస్లిమేతరులతో సహా 25 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.

మరోవైపు, బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకెళుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ కూటమి 200కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 95, జేడీయూ 82 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఎల్జేపీ(ఆర్‌వీ) 19, రాష్ట్రీయ లోక్ మోర్చా 4, హమ్ పార్టీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక మహాఘట్‌బంధన్ కూటమి కేవలం 31 స్థానాలకే పరిమితమై, అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది.


More Telugu News