చంద్రబాబు ఒక విజనరీ సీఎం.. ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడే: పీయూష్ గోయెల్

  • గ్లోబల్ ట్రేడ్ గేట్‌వేగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని ప్రశంస
  • ఢిల్లీలోని 'భారత్ మండపం' తరహాలో 'ఆంధ్రా మండపం' నిర్మాణానికి సిద్ధం
  • 2047 నాటికి స్వర్ణాంధ్ర, సుసంపన్న భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెల్లడి
  • ప్రధాని మోదీపై విశ్వాసంతోనే బీహార్‌లో ఎన్డీఏకు ప్రజలు పట్టం కడుతున్నారని వ్యాఖ్య 
  • టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్వేచ్ఛా వాణిజ్యంతో దేశం ఆర్థికంగా బలపడుతోందన్న గోయెల్  
విశాఖ వేదిక‌గా జ‌రుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబు కేవలం రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే కాకుండా యావత్ భారతదేశ ప్రగతి గురించి ఆలోచించే దార్శనిక నాయకుడు (విజనరీ సీఎం) అని  ప్రశంసించారు. చంద్రబాబు వంటి నాయకుడు ఉన్న ఏపీలో పుట్టిన ప్రతి బిడ్డ అదృష్టవంతుడని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆయన కొనియాడారు. 

'స్వర్ణాంధ్ర విజన్ 2047'తో ఆంధ్రప్రదేశ్ సాంకేతికంగా, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతుందని పీయూష్ గోయెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఒక 'గ్లోబల్ ట్రేడ్ గేట్‌వే'గా నిలుస్తోందని, స్టీల్ ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో ఈ ప్రాంతం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని గుర్తుచేశారు. వాణిజ్య ప్రదర్శనలు, సదస్సుల కోసం ఢిల్లీలో నిర్మించిన 'భారత్ మండపం' తరహాలో 'ఆంధ్రా మండపం' నిర్మించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు.

2047 నాటికి భారతదేశాన్ని ఒక సుసంపన్న దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే ఈ ప్రగతిని సాధిస్తామని గోయెల్ తెలిపారు. 'టెక్నాలజీ డెమొక్రటైజేషన్' విధానంతో టెక్నాలజీని అందరికీ చేరువ చేస్తున్నామని చెప్పారు. భారత్ ప్రవేశపెట్టిన డిజిటల్ చెల్లింపుల విధానాన్ని నేడు అనేక దేశాలు అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని, 104 శాటిలైట్లను ఒకేసారి ప్రయోగించి సాంకేతిక సత్తా చాటామని అన్నారు.

'వసుధైక కుటుంబం' అనే భారతీయ భావనకు అనుగుణంగా, కోవిడ్ సమయంలో 110 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసి భారత్ తన గొప్పతనాన్ని నిరూపించుకుందని గుర్తుచేశారు. 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తున్నామని వివరించారు. స్వేచ్ఛా వాణిజ్యం కోసం వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటూ వాణిజ్య బంధాలను బలోపేతం చేస్తున్నామని, జీఎస్టీ వంటి సంస్కరణలతో ఆర్థిక అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని తెలిపారు.

ఇదే సమయంలో బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన స్పందించారు. వస్తున్న ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు ఉన్న అపారమైన విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు మద్దతుగా నిలుస్తున్న బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అత్యంత పారదర్శకమైన వాణిజ్య విధానాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, సీఐఐ వంటి సదస్సులతో సరికొత్త పెట్టుబడులు, ఆవిష్కరణలు రావడం అభినందనీయమని పీయూష్ గోయెల్ పేర్కొన్నారు.


More Telugu News