సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. సాయి సుదర్శన్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై కుంబ్లే ఆశ్చర్యం

  • తుది జట్టులో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు
  • నెం.3 స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్న వాషింగ్టన్ సుందర్
  • జట్టు కూర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్ కుంబ్లే
  • నితీశ్ కుమార్ రెడ్డి, సుదర్శన్ స్థానంలో పంత్, అక్షర్‌కు చోటు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైన తొలి టెస్టులో భారత జట్టు యాజమాన్యం అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను పక్కనపెట్టి, ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేసింది. తుది జట్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ రూపంలో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లకు చోటు కల్పించింది. అంతేకాకుండా, వాషింగ్టన్ సుందర్‌ను నెం.3 బ్యాటింగ్ స్థానంలో పరీక్షించాలని నిర్ణయించింది.

వెస్టిండీస్‌తో జరిగిన గత టెస్టుతో పోలిస్తే భారత తుది జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి స్థానాల్లో వికెట్ కీపర్ రిషభ్ పంత్, అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. అంతకుముందు నితీశ్ కుమార్‌ను దక్షిణాఫ్రికా-ఏతో అనధికారిక వన్డే సిరీస్ ఆడేందుకు వీలుగా ప్రధాన జట్టు నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియా-ఏ తరఫున దక్షిణాఫ్రికా-ఏపై రెండు సెంచరీలు సాధించిన ధ్రువ్ జురెల్ ఈ మ్యాచ్‌లో నెం.6 స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు.

భారత జట్టు కూర్పుపై మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాయి సుదర్శన్‌ను తప్పిస్తారని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. టెస్టు జట్టులో ఇంతమంది ఆల్‌రౌండర్ల అవసరం ఏంటని ఆయన ప్రశ్నించాడు.

మ్యాచ్‌కు ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో కుంబ్లే మాట్లాడుతూ.. "జట్టు కూర్పు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ టెస్టులో సాయి సుదర్శన్ ఆడతాడని నేను కచ్చితంగా అనుకున్నాను. ఇప్పుడు నం. 3లో ఎవరు బ్యాటింగ్ చేస్తారనేది ప్రశ్న. వాషింగ్టన్ సుందర్‌ను ఆ స్థానంలో ఆడించబోతున్నారు. నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో భారత్ బరిలోకి దిగుతోంది" అని అన్నారు.

"తొలిరోజు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురు స్పిన్నర్లు అవసరం లేదు. వారిలో ఒకరికి బౌలింగ్ చేసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బౌలింగ్ వనరులను ఎలా ఉపయోగిస్తాడో చూడాలి" అని కుంబ్లే విశ్లేషించారు.

భారత జట్టు మొత్తం ఆల్‌రౌండర్లతో నిండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. "బ్యాటింగ్ లైనప్‌లో శుభ్‌మన్, యశస్వి, కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వారంతా ఆల్‌రౌండర్లే. నేను రిషభ్ పంత్‌ను, ధ్రువ్ జురెల్‌ను కూడా ఆల్‌రౌండర్లుగానే పరిగణిస్తాను. ఆ తర్వాత జడేజా, అక్షర్, సుందర్ ఉన్నారు. బహుశా మూడు ఫార్మాట్లలోనూ భారత్ ఇదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లుంది" అని వ్యాఖ్యానించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పక్కటెముకల గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఆ జట్టు స్టార్ పేసర్ కగిసో రబాడ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.


More Telugu News