జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠ.. మధ్యాహ్నం కల్లా స్పష్టత

  • మ‌రికొద్దిసేప‌ట్లో ప్రారంభం కానున్న‌ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 
  • మధ్యాహ్నంలోపే వెలువడనున్న ఫలితం
  • యూసఫ్‌గూడ స్టేడియంలో 10 రౌండ్లలో లెక్కింపు
  • గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా
  • ఫలితంపై తీవ్ర ఉత్కంఠ, జోరుగా బెట్టింగ్‌లు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో తేలనుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పటిష్ట భద్రత నడుమ ప్రారంభమైంది. మధ్యాహ్నం లోపే విజేత ఎవరో స్పష్టత రానుంది.

మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో 186 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పారదర్శకత కోసం ప్రతి టేబుల్ వద్ద ఒక సీసీ కెమెరాను అమర్చారు. తొలుత 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత షేక్‌పేట డివిజన్‌కు సంబంధించిన ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓటర్లు ఉండగా, నవంబరు 11న జరిగిన పోలింగ్‌లో 1,94,621 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 48.49 శాతం పోలింగ్ నమోదైంది.

ఈ ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫలితంపై జోరుగా బెట్టింగ్‌లు కూడా సాగుతున్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


More Telugu News