మాజీ ఎంపీ భరత్ నుంచి ప్రాణహాని.. అనుచరుడి సంచలన ఆరోపణలు

  • మాజీ ఎంపీ భరత్‌, ఆయన అనుచరుడి నుంచి ప్రాణహాని ఉంద‌న్న రామశర్మ
  • భరత్ చీకటి దందాలకు తానే సాక్షినని ఆరోపణ
  • నెలనెలా రూ.5 కోట్ల మామూళ్లు వసూలు చేసి ఇచ్చానని వెల్ల‌డి
  • భరత్ వల్లే తాను అప్పులపాలై అజ్ఞాతంలోకి వెళ్లానని ఆవేద‌న‌
  • తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు
  • తనకు, కుటుంబానికి ఏం జరిగినా వారిదే బాధ్యత అన్న రామ‌శ‌ర్మ‌
వైసీపీ నేత, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఆయన ప్రధాన అనుచరుడు పీతా రామకృష్ణ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆయన మాజీ అనుచరుడు రామశర్మ సంచలన ఆరోపణలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. గురువారం రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

భరత్ చేసిన అనేక చీకటి దందాలకు తానే సాక్షినని, అందుకే తనను అంతం చేయాలని చూస్తున్నారని రామశర్మ ఆరోపించారు. తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి హాని జరిగినా దానికి పూర్తి బాధ్యత భరత్‌రామ్‌, పీతా రామకృష్ణలదేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా రామశర్మ మాట్లాడుతూ.. "భరత్ కోసం ఎన్నో పనులు చేశాను. టీడీపీ నేత యిన్నమూరి దీపును బెదిరించి వైసీపీలోకి వచ్చేలా చేశాం. ఏపీ పేపర్‌ మిల్లు యూనియన్‌ నాయకుడు చిట్టూరి ప్రవీణ్‌ చౌదరిని పార్టీలోకి తీసుకొచ్చాం. రెడ్‌ గ్రావెల్‌ మైనింగ్‌, ఇసుక ర్యాంప్‌ల నుంచి నెలనెలా సుమారు రూ.5 కోట్ల వరకు మామూళ్లు వసూలు చేసి భరత్‌కు అందజేశాను" అని తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌ రెడ్డి వంటి కీలక నేతలు పర్యటనకు వచ్చినప్పుడు ఖర్చులన్నీ తనతోనే పెట్టించేవారని రామశర్మ వాపోయారు. ఈ క్రమంలోనే తాను అప్పులపాలై అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే, పీతా రామకృష్ణకు తాను డబ్బులు బాకీ ఉండటంతో.. తన తల్లిదండ్రులను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. "డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని రామకృష్ణ ఫోన్‌లో బెదిరిస్తున్నాడు. దీనిపై ప్రకాశ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు" అని రామశర్మ వివరించారు.


More Telugu News