అది మా చట్టబద్ధమైన భూమి: పవన్‌పై మిథున్ రెడ్డి ఫైర్

  • పెద్దిరెడ్డి భూకబ్జాలపై పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే
  • విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి
  • పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి
  • చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్
  • ఆ భూమి 2000లోనే చట్టబద్ధంగా కొన్నామన్న మిథున్ రెడ్డి
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారంటూ పవన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి తూర్పు కనుమల పరిధిలోని మంగళం పేటలో అటవీ భూములను ఆక్రమించారని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పవన్ హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ భూ కబ్జాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.

పవన్ కల్యాణ్ ఆరోపణలపై పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి 'ఎక్స్' వేదికగా స్పందించారు. "పవన్ కల్యాణ్ గారూ, గతంలో ఎర్రచందనం విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా? ఇప్పుడు హెలికాప్టర్‌లో నుంచి మీరు చూపించిన భూమి మా చట్టబద్ధమైన సొత్తు. ఆ భూమిని మేము 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశాం" అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News