విశాఖ చేరుకున్న నారా లోకేశ్.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి

  • విశాఖలో లోకేశ్ కు ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలు
  • చంద్రబాబుతో కలిసి కీలక కార్యక్రమంలో పాల్గొననున్న లోకేశ్
  • రహేజా ఐటీ స్పేస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ పనులకు శ్రీకారం
ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విశాఖ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

విమానాశ్రయం నుంచి మంత్రి లోకేశ్ నేరుగా నోవాటెల్ హోటల్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన ఒక కీలక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రముఖ ఇంధన సంస్థ 'రెన్యూ పవర్'తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొంటారు.

ఈ కార్యక్రమం అనంతరం లోకేశ్ విశాఖ ఐటీ హిల్స్‌లో పర్యటించనున్నారు. నగరంలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టించే లక్ష్యంతో పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో భాగంగా రహేజా ఐటీ స్పేస్, దానికి అనుబంధంగా నిర్మించనున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌తో పాటు ప్రతిష్ఠాత్మక వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ నిర్మాణ పనులను ఆయన లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీటితో పాటు మరికొన్ని ఐటీ కంపెనీల ఏర్పాటుకు కూడా మంత్రి లోకేశ్ భూమిపూజ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.


More Telugu News