పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయో చెప్పాలి: పవన్ కల్యాణ్

  • అటవీ ఆస్తుల పరిరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కీలక సమీక్ష
  • అటవీ భూముల కబ్జాపై కఠిన చర్యలు తీసుకోవాలన్న పవన్ 
  • ఆక్రమణదారుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచాలని సూచన 
  • మంగళంపేట కబ్జాలపై విజిలెన్స్‌ నివేదిక ప్రకారం ముందుకెళ్లాలని స్పష్టీకరణ
రాష్ట్రంలోని అటవీ ఆస్తులను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ భూముల పరిరక్షణ అంశంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ భూముల ఆక్రమణల విషయంలో ఎంతటి పలుకుబడి ఉన్నవారినైనా ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. 

అటవీ భూములను ఆక్రమించిన వారి పూర్తి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని పవన్ కల్యాణ్ సూచించారు. ఎవరి ఆక్రమణలో ఎంత భూమి ఉంది, దానిపై నమోదైన కేసుల వివరాలతో సహా అన్నింటినీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, మంగళంపేట అటవీ భూముల ఆక్రమణల విషయంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "పెద్దిరెడ్డి కుటుంబానికి అడవుల్లో వారసత్వ భూములు ఎలా వచ్చాయి?" అని సూటిగా ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా భావితరాల కోసం ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు. అటవీ భూముల జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.


More Telugu News