కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సిట్

  • తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం
  • వైసీపీ హయాంలోని టీటీడీ ఈవో ధర్మారెడ్డిని రెండో రోజు విచారణ చేసిన సిట్
  • సుమారు 8 గంటల పాటు కొనసాగిన ప్రశ్నల పరంపర
  • కమిటీ నిర్ణయం ప్రకారమే కొన్నామన్న ధర్మారెడ్డి
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో ఈ విచారణ జరిగింది.
 
డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని సిట్ బృందం, బుధవారం ధర్మారెడ్డిని దాదాపు 8 గంటల పాటు విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా భోలేబాబా డెయిరీ నుంచి కల్తీ నెయ్యిని ఎలా సేకరించారు, నాణ్యతా ప్రమాణాలను ఎందుకు పట్టించుకోలేదన్న అంశాలపై అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
 
విచారణ సందర్భంగా, ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే నెయ్యి కొనుగోలు చేశామని ధర్మారెడ్డి అధికారులకు వివరించినట్లు సమాచారం. అయితే, అధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా, మరికొన్నింటికి మౌనం వహించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
 
ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయి, బెయిల్‌పై బయటకు వచ్చిన భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లను కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ధర్మారెడ్డి అప్రూవర్‌గా మారి నాడు జరిగిన ఉల్లంఘనలను సిట్ ముందు అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.  


More Telugu News