'నమో' అంటే కొత్త అర్థం చెప్పిన మంత్రి నారా లోకేశ్

  • ఏపీలో ఉన్నది నమో ప్రభుత్వం.. అంటే నాయుడు, మోదీ ప్రభుత్వం అని వెల్లడి
  • రాష్ట్రంలో డబుల్ ఇంజన్ కాదు.. బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉందన్న లోకేశ్
  • విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సు
  • ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా అని ఉద్ఘాటన 
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్' ప్రభుత్వం ఉందని, ఇక్కడ 'నమో' (NAMO) పాలన సాగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 'నమో' అంటే కేవలం ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే కాదని... నమో అంటే 'నాయుడు గారు, మోదీ గారు' అని ఆయన సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం, ప్రధాని మోదీ గారి దార్శనికతతో ఏపీ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) వివరాలను వెల్లడించేందుకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేశ్ తెలిపారు. ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా అని, రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని పునరుద్ఘాటించారు. "ఇది కేవలం ఒక లక్ష్యం కాదు, మా యువతకు మేమిచ్చిన ప్రమాణం. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని ఉపాధి దార్శనికత ఇది. అందుకే మేం రూపొందించే ప్రతి విధానం ఉద్యోగాల సృష్టి చుట్టూనే ఉంటుంది" అని వివరించారు.

పాదయాత్ర అనుభవంతోనే ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం

తాను యువగళం పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ యాత్రలో ఎదురైన అనేక సంఘటనలు తనను తీర్చిదిద్దాయని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "పాదయాత్రలో గంగాధర నెల్లూరులో మోహన అనే మహిళ నన్ను కలిశారు. తన భర్త మద్యానికి బానిసై చనిపోయాడని, తాను రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముతూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏం కావాలని అడిగినప్పుడు, తన పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇప్పించాలని కోరారు. ఆ క్షణం నాకు అర్థమైంది, ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదు, గౌరవంగా బతికేందుకు అవసరమైన ఉద్యోగాలు అని. ఆ స్ఫూర్తితోనే ఉద్యోగాల కల్పనను మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా స్వీకరించాం" అని లోకేశ్ భావోద్వేగంగా చెప్పారు.

16 నెలల్లో 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

గడిచిన 16 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్‌కు 120 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయని లోకేశ్ వెల్లడించారు. ఇవి కేవలం ఒప్పంద పత్రాలకు (ఎంవోయూ) పరిమితమైనవి కావని, వాస్తవ రూపం దాలుస్తున్న ప్రాజెక్టులని స్పష్టం చేశారు. "ఉదాహరణకు, దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతున్న ఆర్సెలర్ మిట్టల్‌తో మేం ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఆదిత్య మిట్టల్‌తో ఒకే ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆ సంస్థ ఏపీకి వచ్చింది. అలాగే, దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయిన గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది. దేశంలోని టాప్ 10 సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలలో 5 సంస్థలు ఏపీనే ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ, ఎన్టీపీసీ రూ.1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాయి" అని లోకేశ్ వివరించారు.

'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మా మంత్రం

పెట్టుబడిదారులను ఆకర్షించడానికి తాము 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అనే విధానాన్ని అనుసరిస్తున్నామని మంత్రి తెలిపారు. "ఈ రోజుల్లో వ్యాపారంలో వేగం చాలా ముఖ్యం. ఒక్క నెల ఆలస్యమైనా మొత్తం వ్యాపార ప్రణాళిక మారిపోతుంది. అందుకే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు మా వేగాన్ని చూసి ఏపీకి వచ్చాయి. కేవలం ఐటీ రంగమే కాదు, పర్యాటక రంగంలోనూ రాబోయే మూడేళ్లలో 50 వేల హోటల్ గదులను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని అన్నారు.

విశాఖ సదస్సు వివరాలు

విశాఖలో జరిగే సీఐఐ సదస్సులో 410 ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, వీటి ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని లోకేశ్ తెలిపారు. ఈ సదస్సు సందర్భంగా రూ.2.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరవుతారని తెలిపారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. 


More Telugu News