Benjamin Netanyahu: ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయొచ్చేమో కానీ... మన ఆత్మలను కదిలించలేదు: ఢిల్లీ పేలుడుపై ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలు

Benjamin Netanyahu Condemns Delhi Blast Supports India
  • ఢిల్లీ కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందన
  • ఉగ్రవాదం మన స్థైర్యాన్ని దెబ్బతీయలేదని వ్యాఖ్య
  • ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతు ప్రకటించిన ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ దేశం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

బుధవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా నెతన్యాహు స్పందించారు. "ప్రియ మిత్రుడు నరేంద్ర మోదీకి, ధైర్యవంతులైన భారత ప్రజలకు.. నేను, నా భార్య సారా, ఇజ్రాయెల్ ప్రజల తరఫున బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. ఈ దుఃఖ సమయంలో ఇజ్రాయెల్ మీకు అండగా నిలుస్తుంది" అని వివరించారు. భారత్, ఇజ్రాయెల్ ప్రాచీన నాగరికతలకు నిదర్శనాలని, శాశ్వత సత్యాలపై నిలబడినవని ఆయన పేర్కొన్నారు. "ఉగ్రవాదం మన నగరాలపై దాడి చేయగలదేమో కానీ, మన ఆత్మలను ఎప్పటికీ కదిలించలేదు. మన దేశాల వెలుగు.. శత్రువుల చీకటిని మించి ప్రకాశిస్తుంది" అని నెతన్యాహు తన సందేశంలో ఉద్ఘాటించారు.

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ కూడా ఈ దాడిని ఖండించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Benjamin Netanyahu
Delhi blast
Israel
Narendra Modi
Red Fort
Terrorism
Gideon Saar
India
Israel-India relations

More Telugu News