Sheikh Hasina: బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి షరతు విధించిన షేక్ హసీనా

Sheikh Hasina Sets Condition for Return to Bangladesh
  • బంగ్లాదేశ్‌లో అందరి భాగస్వామ్యం ఉండేలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న హసీనా
  • పార్టీపై నిషేధం ఎత్తివేత, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహిస్తే తిరిగి వెళతానని వెల్లడి
  • భారత్‌తో సంబంధాలను యూనస్ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తోందని ఆందోళన
బంగ్లాదేశ్‌కు తిరిగి రావడానికి షేక్ హసీనా ఒక షరతు విధించారు. తాను స్వదేశానికి తిరిగి రావాలంటే బంగ్లాదేశ్‌లో అందరి భాగస్వామ్యంతో కూడిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆమె అన్నారు. గత ఏడాది రిజర్వేషన్ల అల్లర్ల నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన షేక్ హసీనా భారతదేశంలో ఒక గుర్తు తెలియని ప్రాంతంలో తలదాచుకుంటున్నారు.

బంగ్లాలో అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేసి, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను నిర్వహించినప్పుడే తాను తిరిగి వెళతానని ఆమె స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితులనే అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని షేక్ హసీనా పేర్కొన్నారు. ప్రస్తుతం యూనస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం తీవ్రవాద శక్తులకు అధికారం ఇస్తూ భారత్‌తో ఆ దేశ సంబంధాలను ప్రమాదంలో పడేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంతో బలమైన సంబంధాలు కొనసాగించామని, యూనస్ ప్రభుత్వం వచ్చాక మూర్ఖత్వంతో వాటిని బలహీనపరుస్తున్నారని ఆమె విమర్శించారు. కష్టకాలంలో తనకు ఆశ్రయం కల్పించినందుకు భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

తాను అధికారంలో ఉన్న సమయంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలను పరిష్కరించడంలో విఫలమయ్యానని, దాని నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు ఆమె చెప్పారు. అయితే, ఆ సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు కూడా బాధ్యత తీసుకుని ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.

తనపై నమోదైన కేసుల విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె అన్నారు. యూనస్ ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. తనను రాజకీయంగా బలహీనపరిచేందుకే ఇలాంటి ఆరోపణలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Sheikh Hasina
Bangladesh
Awami League
Democracy
Elections
India
Narendra Modi
Yunus
Political crisis
Refugee

More Telugu News