కేఎస్‌సీఏ అధ్యక్ష బరిలో వెంకటేశ్ ప్రసాద్.. మద్దతుగా నిలిచిన కుంబ్లే, శ్రీనాథ్

  • కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వెంకటేశ్ ప్రసాద్
  • కర్ణాటక క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యమన్న వెంకీ
  • ఈ నెల 30న జరగనున్న కేఎస్‌సీఏ ఎన్నికలు
భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. అతడికి టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తమ పూర్తి మద్దతును తెలిపారు. కర్ణాటక క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తాము బరిలోకి దిగుతున్నామని, తెర వెనుక నుంచి నడిపించే పెత్తనానికి చరమగీతం పాడతామని స్పష్టం చేశారు.

ఈ నెల 30న కేఎస్‌సీఏ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన వెంకటేశ్ ప్రసాద్... తన ప్యానెల్ వివరాలను వెల్లడించాడు. "చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు తీసుకురావాలి. దీనికి తెర వెనుక నుంచి ఎవరూ నియంత్రించలేని స్వతంత్ర పరిపాలన అవసరం. అధికారం కోసమో, పదవుల కోసమో మేము పోటీ చేయడం లేదు. కర్ణాటక క్రికెట్ ప్రయోజనాలే మాకు ముఖ్యం" అని అన్నాడు.

2010-13 మధ్య కాలంలో కుంబ్లే అధ్యక్షుడిగా, శ్రీనాథ్ కార్యదర్శిగా, తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసోసియేషన్‌ను విజయవంతంగా నడిపించామని ప్రసాద్ గుర్తుచేశాడు. ఆ సమయంలో క్రికెట్, మౌలిక సదుపాయాలు రెండూ అభివృద్ధి చెందాయని, ప్రస్తుత పరిస్థితి మాత్రం విచారకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. అదే విజయవంతమైన కాలాన్ని పునరావృతం చేసేందుకు తమ ప్యానెల్ కృషి చేస్తుందని తెలిపాడు.

వెంకటేశ్ ప్రసాద్ ప్యానెల్‌లో భారత మాజీ బ్యాట్స్‌మన్ సుజిత్ సోమసుందరం (వైస్ ప్రెసిడెంట్), వినయ్ మృత్యుంజయ (సెక్రటరీ), ఏవీ శశిధర్ (జాయింట్ సెక్రటరీ), మధుకర్ (కోశాధికారి), మాజీ క్రికెటర్ అవినాష్ వైద్య (సంస్థాగత సభ్యుడు) పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోమసుందరం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎడ్యుకేషన్ చీఫ్ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే మాట్లాడుతూ, "ప్రస్తుతం కర్ణాటక క్రికెట్ కష్టాల్లో ఉంది. ఒకప్పుడు రంజీ ట్రోఫీలో ముంబై తర్వాత మనమే ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ గుర్తింపు మసకబారింది. మనం మన వైభవాన్ని తిరిగి పొందాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు. జవగళ్ శ్రీనాథ్ స్పందిస్తూ, "వెనుక సీటు డ్రైవింగ్ సిండ్రోమ్‌ను అంతం చేయాలి. పరిపాలనలో గౌరవం ఉన్నప్పుడు వెనుక నుంచి ఎవరూ నియంత్రించాల్సిన పని ఉండదు. వెంకీ నాయకత్వంలో మరోసారి బలమైన మౌలిక సదుపాయాలు, అవకాశాలు సృష్టించగలం" అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

ఈ నెల 16 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు రఘురామ్‌ భట్‌ పదవీకాలం సెప్టెంబర్‌ 30తో ముగిసిన విషయం తెలిసిందే.


More Telugu News