ఢిల్లీ పేలుడు.. 10 రోజుల ముందు కారు కొనుగోలు చేసి, అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిన డాక్టర్ ఉమర్ నబీ

  • అక్టోబర్ 29న కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాన్ని తీసుకున్న ఉమర్ నబీ
  • సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకుంటుండటంతో ఆందోళనకు గురైన ఉమర్ నబీ
  • నవంబర్ 10న కారును తీసుకుని ఢిల్లీ వైపు వెళ్లిన ఉమర్ నబీ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ పేలుడుకు పది రోజుల ముందు కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అక్టోబర్ 29న కారును కొనుగోలు చేసిన వెంటనే కాలుష్య నియంత్రణ ధృవపత్రాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఉమర్ నబీ అండర్ గ్రౌండ్‌కు వెళ్లిపోగా, కారు ఎక్కడ ఉందో కచ్చితంగా తెలియడం లేదు. ఈ కారు పేలుడుకు ముందు పది రోజులుగా అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం వద్ద ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం అక్కడ లేదని చెబుతున్నారు.

సహచరులను అదుపులోకి తీసుకుంటుండటంతో...

కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం తీసుకునే సమయంలో ముగ్గురు వ్యక్తులు కారు నుంచి బయటకు వచ్చారు. వారు ఎవరు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, గత కొన్ని రోజులుగా పోలీసులు తన సహచరులను వరుసగా అదుపులోకి తీసుకుంటుండటంతో ఆందోళనకు గురైన ఉమర్ నబీ నవంబర్ 10న కారును తీసుకుని ఢిల్లీ వైపు వెళ్లినట్లు దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

ఉమర్ నబీ కారును కొనుగోలు చేసినప్పటికీ యజమానిగా సల్మాన్ పేరు ఉంది. దీంతో పోలీసులు గురుగ్రామ్‌లో అతనిని అదుపులోకి తీసుకున్నారు. 2014 మార్చి 18న సల్మాన్ పేరిట ఈ కారును కొనుగోలు చేశారు. ఆ తర్వాత కారును దేవేంద్ర అనే వ్యక్తికి అమ్మేశాడు. ఆ తర్వాత సోనూ అనే వ్యక్తి చేతికి చేరిన కారు, అనంతరం పుల్వామాకు చెందిన తారిఖ్ వద్దకు చేరింది. ఈ వాహనం పలుమార్లు చేతులు మారినప్పటికీ యాజమాన్య బదిలీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేవు. దీంతో నకిలీ పత్రాలతో కొనుగోళ్లు, విక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది.


More Telugu News