కేంద్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసి నకిలీ అరెస్ట్ వారెంట్.. రూ.99 లక్షలు కొట్టేసిన కేటుగాడు

  • పుణే వృద్ధురాలికి డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు
  • నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన వారెంట్ పంపిన సైబర్ నేరస్థులు
  • బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా బదలాయించుకుని ఫోన్ స్విచ్చాఫ్ చేసిన వైనం
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
సైబర్ నేరస్థులు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు. సరికొత్త ఎత్తులతో ఉన్నత విద్యావంతులనూ మోసం చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరగడంతో మరో కొత్త వ్యూహంతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా పుణేకు చెందిన ఓ వృద్ధురాలిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.99 లక్షలు కాజేశారు. ఇందుకోసం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ అరెస్ట్ వారెంట్ ను సృష్టించారు. దీంతో ఉన్నతవిద్యావంతురాలు, ఎల్ఐసీ మాజీ ఉన్నతాధికారి అయిన ఆ వృద్ధురాలు నమ్మి మోసపోయారు. పుణే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

పూణేకు చెందిన 62 ఏళ్ల మహిళ ఎల్ఐసీలో ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఇటీవల ఆమెకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఓ ఫోన్ నెంబర్ తో దుండగులు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారని అవతలి వ్యక్తి బెదిరింపులకు గురిచేశాడు. ఈ విషయంపై సీనియర్ ఆఫీసర్ వీడియో కాల్ లో మాట్లాడతారంటూ ఫోన్ పెట్టేశాడు. కాసేపటి తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీసర్ జార్జ్ మాథ్యూ పేరుతో మరో దుండగుడు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు. ఆమె ఆధార్ కార్డ్ తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తో ఆర్థిక మోసాలు జరిగాయని, ఈ కారణంగా మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని చెప్పాడు.

ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సంతకంతో జారీ అయిన ఓ నకిలీ అరెస్ట్ వారెంట్ ను వాట్సాప్ చేశాడు. మనీలాండరింగ్ కేసు కావడంతో దర్యాప్తు కోసం బ్యాంకులో ఉన్న నగదు మొత్తం తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, ఆర్బీఐ తనిఖీ తర్వాత ఆ మొత్తం తిరిగి ఆమె ఖాతాలో జమ అవుతుందని నమ్మబలికాడు. నిధులు బదిలీ చేయకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరించడంతో భయాందోళనకు గురైన బాధితురాలు దుండగుడు చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ.99 లక్షలు బదిలీ చేసింది. ఆ తర్వాత దుండగుడికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. పుణే సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


More Telugu News