టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి బైక్ లోని రూ.2 లక్షలు మాయం.. పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీ

  • బ్యాంకులో డబ్బు డ్రా చేసి ఇంటికి వెళుతూ మధ్యలో హోటల్ దగ్గర ఆగిన యువకుడు
  • బ్యాంకు దగ్గరి నుంచి ఫాలో అయిన దొంగ
  • సీసీటీవీ ఫుటేజీలో చోరీ ఘటన రికార్డు
బ్యాంకులో డ్రా చేసిన డబ్బును బైక్ కవర్ లో పెట్టి తీసుకెళుతున్న యువకుడు మధ్యలో ఓ హోటల్ వద్ద ఆగాడు. లోపలికి వెళ్లి టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి బైక్ లోని డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో చోటుచేసుకుందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

నరసాపురం మండలం వేములదీవి గ్రామానికి చెందిన ఉంగరాల శ్రీను అనే యువకుడు ఎస్ బీఐ బ్యాంకులో రూ.2 లక్షలు డ్రా చేశాడు. ఆ డబ్బును బైక్ కవర్ లో పెట్టి బయలుదేరాడు. మార్గమధ్యంలో టిఫిన్ చేసేందుకు ఓ హోటల్ వద్ద ఆగాడు. బైక్ ను పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. టిఫిన్ చేసి తిరిగొచ్చేసరికి బైక్ లో పెట్టిన 2 లక్షలు కనిపించలేదు. దీంతో వెంటనే హోటల్ ముందున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా.. ఓ యువకుడు డబ్బు తీసుకెళ్లడం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, శ్రీనివాస్ బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేయడం గమనించిన దొంగ.. అక్కడి నుంచే శ్రీనివాస్ బైక్ ను ఫాలో అయ్యాడని, హోటల్ దగ్గర అవకాశం చిక్కడంతో చోరీ చేసి పారిపోయాడని పోలీసులు చెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బును తీసుకెళ్లేటపుడు, బ్యాంకులో డబ్బు డ్రా చేసి తీసుకెళ్లేటపుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.


More Telugu News