అప్పుడు చిరంజీవి కథానాయిక.. ఇప్పుడు చరణ్ ‘పెద్ది’లో కీలకపాత్రధారి.. మెగా అభిమానుల్లో కొత్త జోష్!

  • రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్న శోభన
  • ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్
  • ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాటకు అద్భుత స్పందన
  • జాన్వీ కపూర్ హీరోయిన్‌.. ఏఆర్ రెహ‌మాన్ సంగీతం
  • గ్రామీణ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మాణం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పెద్ది’ నుంచి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రంలో అలనాటి నటి శోభన ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

గతేడాది ‘కల్కి 2898 ఏడీ’తో చాలా కాలం తర్వాత తెలుగు తెరపై కనిపించిన శోభన, ‘పెద్ది’లో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఆమె పాత్ర సినిమాకు ఎమోషనల్ డెప్త్‌ని ఇస్తుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘రుద్రవీణ’, ‘రౌడీ అల్లుడు’ వంటి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న శోభన, ఇప్పుడు ఆయన తనయుడు రామ్ చరణ్ సినిమాలో నటించనుండటం మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇక‌, ఇటీవలే ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ మాస్ బీట్‌కు రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ తోడవ్వడంతో యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో చరణ్ స్టైలిష్ లుక్, పాట చిత్రీకరణ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో అనుబంధం ఉన్న సతీశ్‌ కిలారు ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయమవుతున్నారు. భారీ బడ్జెట్, ఉన్నత సాంకేతిక విలువలతో గ్రామీణ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పాటల విజయం, ఇప్పుడు శోభన వంటి సీనియర్ నటి చేరికతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి.


More Telugu News