సీనియర్ సిటిజన్లు ఉన్నా లోయర్ బెర్త్ రాలేదా.. కారణం చెప్పిన టీటీఈ

  • 45 ఏళ్లు పైబడిన మహిళలకు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు లోయర్ బెర్త్
  • గర్భిణీలకూ లోయర్ బెర్త్ కేటాయిస్తున్న రైల్వే
  • బుకింగ్ సమయంలో చేసే పొరపాట్ల వల్లే లోయర్ బెర్త్ రావడంలేదని టీటీఈ వివరణ
టికెట్ బుకింగ్ సమయంలో సీనియర్ సిటిజన్ ఉన్నారని పేర్కొన్నా లోయర్ బెర్త్ రాలేదని చాలామంది ప్రయాణికులు వాపోతుంటారు. ప్రయాణంలో లోయర్ బెర్త్ కోసం రిక్వెస్ట్ చేయడం చూస్తూనే ఉంటాం. వృద్ధులకు లోయర్ బెర్త్ కేటాయించని అధికారులను తిట్టుకుంటుంటాం. అయితే, బుకింగ్ సమయంలో చేసే పొరపాట్ల వల్లే లోయర్ బెర్త్ కేటాయించడం లేదని ఓ టీటీఈ వివరణ ఇచ్చారు. లోయర్ బెర్త్ కేటాయించడానికి ఉన్న నిబంధనలను, బుకింగ్ సమయంలో ప్రయాణికులు చేసే పొరపాట్లను వివరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిబంధనలు ఇవే..
బెర్తుల కేటాయింపులో గర్భిణీలకు, 45 ఏళ్ల పైబడిన మహిళలు, 60 ఏళ్లు దాటిన పురుషులకు ప్రత్యేక కోటా ఉంటుంది. బుకింగ్‌ సమయంలో సీనియర్‌ సిటిజన్‌ కోటా ఎంచుకుంటే లోయర్‌ బెర్తులను కేటాయిస్తారు. స్లీపర్‌ క్లాస్‌లో అయితే ప్రతి కోచ్‌లో 6 నుంచి 7 లోయర్‌ బెర్త్‌లను, ఏసీ త్రీటైర్‌లో 4 నుంచి 5, ఏసీ 2-టైర్‌లో 3 నుంచి 4 లోయర్‌ బెర్తులను ఈ కోటా కింద కేటాయిస్తారు. సీనియర్ సిటిజన్లు ఒంటరిగా లేదా ఇద్దరు సీనియర్ సిటిజన్లు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ కోటా వర్తిస్తుంది. ఒకే పీఎన్‌ఆర్‌ పై సీనియర్ సిటిజన్లతో పాటు మిగతా ప్రయాణికులు ఉంటే టికెట్ బుకింగ్ సిస్టం ఆ బుకింగ్ ను జనరల్‌ కోటాగా పరిగణిస్తుంది. దీంతో లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం తగ్గిపోతుంది. సీనియర్ సిటిజన్ అయినా చాలామందికి లోయర్ బెర్త్ దొరకకపోవడానికి కారణం ఇదేనని టీటీఈ చెప్పారు.

మరేంచేయాలంటే..
సీనియర్ సిటిజన్లతో కలిసి ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకుంటున్నప్పుడు వారికోసం ప్రత్యేకంగా బుకింగ్ చేయాలని టీటీఈ చెప్పారు. అంటే.. సీనియర్ సిటిజన్లకు, మిగతా కుటుంబ సభ్యులకు విడివిడిగా టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.


More Telugu News