హీరో గోవిందాకు ఏమైంది?.. అర్ధరాత్రి ఆసుపత్రికి తరలింపు

  • ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందాకు అస్వస్థత
  • మంగళవారం రాత్రి ఇంట్లో స్పృహతప్పి పడిపోయిన హీరో
  • వెంటనే ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలింపు
  • ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గోవిందా
  • పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపిన సన్నిహితులు
ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా (61) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయన తన నివాసంలో స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ముంబై జుహూలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

గోవిందా స్నేహితుడు, న్యాయ సలహాదారు అయిన లలిత్ బిందాల్ ఈ విషయాన్ని ఎన్డీటీవీకి తెలియ‌జేశారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్నప్పుడు గోవిందా ఒక్కసారిగా కళ్లు తిరిగి స్పృహ కోల్పోయారని తెలిపారు. వెంటనే ఫోన్‌లో డాక్టర్‌ను సంప్రదించి, ఆయన సూచన మేరకు మందులు ఇచ్చామని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితిని గమనించి, అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించినట్లు వివరించారు.

ప్రస్తుతం గోవిందాకు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహించారని, వాటికి సంబంధించిన రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నామని బిందాల్ పేర్కొన్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాగా, గతేడాది అక్టోబర్‌లో కూడా గోవిందా ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను అల్మరాలో పెడుతుండగా అది ప్రమాదవశాత్తు కిందపడి పేలింది. ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ గాయమైంది. అప్పుడు కూడా ఇదే క్రిటికేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. గంటపాటు జరిగిన శస్త్రచికిత్స అనంతరం వైద్యులు బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించారు.


More Telugu News