రోహిత్ శర్మలోని కొత్త యాంగిల్.. పెళ్లి జంటకు అదిరిపోయే గిఫ్ట్.. వీడియో వైరల్!

  • తన ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసుకుంటున్న జంట
  • 'ఆజ్ మేరే యార్ కీ షాదీ హై' పాటకు డ్యాన్స్ చేసిన రోహిత్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • రోహిత్ సరదా చేష్టకు మురిసిపోయిన నూతన వధూవరులు
మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించే టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ, ఆఫ్‌ఫీల్డ్‌లో ఎంతో సరదాగా ఉంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయనలోని ఈ సరదా కోణం మరోసారి బయటపడింది. తన ఇంటి సమీపంలో పెళ్లి ఫోటోషూట్ చేసుకుంటున్న ఓ కొత్త జంటను చూసి, వారి ఆనందంలో పాలుపంచుకుంటూ రోహిత్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే... ఓ నూతన వధూవరులు తమ పెళ్లి ఫోటోషూట్‌లో నిమగ్నమై ఉన్నారు. అదే సమయంలో తన ఇంటి బాల్కనీలో ఉన్న రోహిత్ శర్మ, వారిని గమనించాడు. వెంటనే అక్కడ వినిపిస్తున్న 'ఆజ్ మేరే యార్ కీ షాదీ హై' (ఈరోజు నా స్నేహితుడి పెళ్లి) అనే పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఊహించని ఈ పరిణామానికి ఆ జంట ఆనందంతో ఆశ్చర్యపోయింది. వరుడు నవ్వుతూ రోహిత్‌కు గౌరవపూర్వకంగా నమస్కరించాడు. వధువు "యే తో మూమెంట్ హై" (ఇది ఒక మధుర క్షణం) అంటూ మురిసిపోవడం వీడియోలో కనిపించింది. ఈ హృద్యమైన వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం రోహిత్ శర్మ క్రికెట్‌కు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అతను ఆడటం లేదు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రోహిత్, చివరి మ్యాచ్‌లో సెంచరీతో మెరిసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డును గెలుచుకున్నాడు.

ఇటీవలే వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరిక
ఈ ప్రదర్శనతో 38 ఏళ్ల రోహిత్, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నెల 30 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌తో రోహిత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. గత కొన్ని నెలలుగా రోహిత్ 10 కిలోలకు పైగా బరువు తగ్గి మరింత ఫిట్‌గా మారడం కూడా గమనార్హం.


More Telugu News