విజయనగరం ఉగ్ర కుట్ర కేసు... ఇద్దరిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

  • ఏపీ, తెలంగాణ టెర్రర్ కుట్ర కేసులో ఇద్దరిపై చార్జిషీట్
  • సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారని ఆరోపణ
  • నిందితుల్లో ఒకరు విజయనగరం వాసి, మరొకరు హైదరాబాద్ వాసి
  • విశాఖ నేవీ గూఢచర్యం కేసులో మరో ఇద్దరు దోషులకు జైలుశిక్ష
  • నిందితులకు 5 ఏళ్ల 10 నెలల సాధారణ జైలుశిక్ష ఖరారు
  • యూఏపీఏ, అధికార రహస్యాల చట్టం కింద శిక్ష విధించిన కోర్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం టెర్రర్ కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులపై విశాఖపట్నంలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల్లో ఒకరు విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్ ఉర్ రహ్మాన్ కాగా, మరొకరు తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశవ్యాప్తంగా యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నారనేది వీరిపై ప్రధాన ఆరోపణ. ఈ మేరకు వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పేలుడు పదార్థాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అభియోగాలు నమోదు చేశారు.

గత మే 16, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిరాజ్, సమీర్‌లను అరెస్ట్ చేశారు. అనంతరం కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దర్యాప్తును చేపట్టింది. నిందితులు ఐసిస్ భావజాలంతో ప్రభావితమై, ఇన్‌స్టాగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లలో పలు గ్రూపులు క్రియేట్ చేసి వందలాది మంది యువతను లక్ష్యంగా చేసుకుని విద్వేష ప్రచారానికి పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశ సమగ్రత, భద్రత, మత సామరస్యానికి భంగం కలిగించేలా వీరి కార్యకలాపాలు సాగాయని అధికారులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.

నేవీ గూఢచర్యం కేసులో ఇద్దరికి జైలుశిక్ష

ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌తో సంబంధాలున్న విశాఖపట్నం నేవీ గూఢచర్యం కేసులో మరో ఇద్దరు నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన కలవలపల్లి కొండబాబు, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన అవినాశ్ సోమల్‌కు 5 సంవత్సరాల 10 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.

యూఏపీఏ సెక్షన్ 18, అధికార రహస్యాల చట్టంలోని సెక్షన్ 3 కింద కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. దీంతో పాటు ఇద్దరికీ చెరో రూ. 5,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.


More Telugu News