ఢిల్లీ పేలుడు కేసును ఎన్ఐఏకి అప్పగించిన కేంద్ర హోంశాఖ

  • ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ
  • ఈ ఘటనలో 13కి చేరిన మృతుల సంఖ్య, 25 మందికి గాయాలు
  • పేలుళ్లకు పుల్వామాతో సంబంధాలున్నట్లు అనుమానాలు
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష
  • సూత్రధారులను వదిలిపెట్టబోమని స్పష్టం చేసిన ప్రధాని మోదీ
  • రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్, భద్రత కట్టుదిట్టం
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా స్వీకరించింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పేలుడు ఘటన సూత్రధారులను వదిలిపెట్టబోమని, దర్యాప్తు సంస్థలు ఈ కేసు మూలాల్లోకి వెళ్లి నిందితులను పట్టుకుంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం స్పష్టం చేశారు.

సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హ్యుందాయ్ ఐ20 కారులో శక్తిమంతమైన పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అమోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, డిటోనేటర్లను ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఈ కేసును కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకి అప్పగించదింది. ఈ కేసును చేతిలోకి తీసుకున్న వెంటనే ఎన్ఐఏ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పడుతూ, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమైంది.

అమిత్ షా ఉన్నతస్థాయి సమీక్ష

ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం తన నివాసంలో ఉన్నతస్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, ఎన్ఐఏ డీజీ సదానంద్ వసంత్ దాతే పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ వర్చువల్‌గా హాజరయ్యారు. అన్ని కోణాల్లోనూ లోతైన దర్యాప్తు జరుగుతుందని అమిత్ షా తెలిపారు.

పుల్వామాతో సంబంధాలు

పేలుడుకు ఉపయోగించిన కారుకు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాతో సంబంధాలున్నట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. పుల్వామాకు చెందిన ఓ వ్యక్తి ఈ కారును కొనుగోలు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అనుమానితుడు ఒక్కడే కారులో ఎర్రకోట పార్కింగ్ ప్రాంతంలోకి వచ్చి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. టోల్ ప్లాజాలతో సహా 100కు పైగా సీసీటీవీ క్లిప్పింగులను పరిశీలిస్తూ దర్యాగంజ్ వైపు కారు ప్రయాణించిన మార్గాన్ని పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ అయి ఉండవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA), పేలుడు పదార్థాల చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పహార్‌గంజ్, దర్యాగంజ్ ప్రాంతాల్లోని హోటళ్లలో రాత్రంతా దాడులు నిర్వహించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజధాని వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


More Telugu News